Viral Video: సెల్ఫీ తీసుకోడానికి వచ్చి సింగర్‌పై దాడి.. శివసేన ఎమ్మేల్యే కుమారుడేనంటూ..
ABN , First Publish Date - 2023-02-21T10:15:08+05:30 IST
ప్రముఖ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత సోనూ నిగమ్ (Sonu Nigam)పై దాడి జరిగింది. ఫిబ్రవరి 20న ముంబైలో ఓ సోనూ బృందం ఓ మ్యూజిక్ ఈవెంట్‌లో పాల్గొంది.
ప్రముఖ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత సోనూ నిగమ్ (Sonu Nigam)పై దాడి జరిగింది. ఫిబ్రవరి 20న ముంబైలో ఓ సోనూ బృందం ఓ మ్యూజిక్ ఈవెంట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి వచ్చి సోనూతో పాటు ఆయన టీమ్‌పై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అందులో వారిపై దాడి చేసింది శివసేన ఎమ్మేల్యే ప్రకాశ్ ఫాటర్‌పేకర్ కుమారుడని సోనూ బృందం ఆరోపించింది. (Shiv Sena MLA Prakash Paterpekar)
ఆ వీడియోలో సోనూ మెట్లపై నుంచి దిగడం, ఆయన జట్టు సభ్యులపై దాడి జరగడం కనిపిస్తోంది. గాయకుడు సోను నిగమ్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 323, 341, 337 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై పోలీస్ డీసీపీ హేమ్‌రాజ్‌సింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘లైవ్ కాన్సర్ట్ తర్వాత, సోను నిగమ్ వేదికపై నుంచి క్రిందికి వస్తుండగా.. ఒక వ్యక్తి అతనిని పట్టుకున్నాడు. ఆయన అభ్యంతరం తెలపడంతో ఆ వ్యక్తి సోను నిగమ్, ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తులను తోసేశాడు. దీంతో కింద పడి ఆ ఇద్దరిలో ఒకరికి గాయాలయ్యాయి. నిందితుడి పేరు స్వప్నిల్ ఫాటర్‌పేకర్, గాయపడిన వ్యక్తిని రబ్బానీగా గుర్తించాం. బాడీగార్డులు వారిస్తున్న వినకుండా నిందితుడు సెల్ఫీ కోసం ప్రయత్నించడంతో ఈ గొడవ జరిగింది’ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: ఎలాన్ మస్క్‌ని కాపీ కొడుతున్నావా?.. ఫేస్‌బుక్ బాస్‌పై బాలీవుడ్ బ్యూటీ సెటైర్లు
సోనూ నిగమ్ మాట్లాడుతూ.. ‘ఈమెంట్ తర్వాత నేను వేదికపై నుంచి క్రిందికి వస్తున్నాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నన్ను పట్టుకున్నాడు. అనంతరం అతను నన్ను రక్షించడానికి వచ్చిన హరి & రబ్బానీని నెట్టాడు. అప్పుడు నేను పడిపోయాను. అలాగే రబ్బానీకి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఇనుప కడ్డీలు పడితే చాలా ప్రమాదం జరిగి ఉండేది. అతను మమ్మల్ని నెట్టడం మీరు వీడియోలో చూడవచ్చు’ అని చెప్పారు.