స్టార్‌ ఇంట్లో బస..

ABN , First Publish Date - 2023-03-12T11:31:03+05:30 IST

స్టార్లు, సెలబ్రిటీలకు చెందిన ప్రతీది వారి అభిమానులకు ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా వారి ఇళ్ల ముందు అభిమానులు గంటల తరబడి పడిగాపులు పడటం చూస్తుంటాం....

స్టార్‌ ఇంట్లో బస..

స్టార్లు, సెలబ్రిటీలకు చెందిన ప్రతీది వారి అభిమానులకు ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా వారి ఇళ్ల ముందు అభిమానులు గంటల తరబడి పడిగాపులు పడటం చూస్తుంటాం. ఒకవేళ... స్టార్ల ఇంట్లో బస చేసే అవకాశం మీకు లభిస్తే... ఎగిరి గంతేస్తారు కదూ! ‘ఎయిర్‌బీఎన్‌బీ’ సంస్థ కొందరు స్టార్లు, సెలబ్రిటీల ఇళ్లను (గతంలో వారు నివసించిన) అద్దెకు తీసుకుని, వాటిని కావాల్సినవారికి అందుబాటులోకి తెస్తోంది. అంటే... సెలబ్రిటీలు గడిపిన ఇంట్లో మీరు అతిథులుగా ఉండొచ్చన్నమాట. అలాంటి కొన్ని అద్దె నివాసాలివి...

బాద్‌షా... పంచ్‌శీల్‌

‘పఠాన్‌’తో వెయ్యికోట్ల రూపాయల మార్క్‌ను చేరుకుని మరోసారి సత్తా చాటాడు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన షారుక్‌ అంచెలంచెలుగా బాలీవుడ్‌లో టాప్‌స్థాయికి ఎదిగాడు. షారుక్‌ స్వస్థలం దిల్లీ. ముంబయికి మకాం మార్చక ముందు షారుక్‌ ఖాన్‌ తన కుటుంబంతో పాటు దిల్లీలోనే నివసించేవాడు. తన భార్య గౌరీకి, తనకి దిల్లీలోని పంచ్‌శీల్‌ పార్కులో ఉన్న ఇంటితో ఎంతో అనుబంధం ఉంది. ఈ విషయాన్ని ఆయనే చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉంది. అందుకే హోజ్‌ రెంటల్‌ యాప్‌ ఎయిర్‌ బీఎన్‌బీతో షారుక్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతిథులు యాప్‌ ద్వారా కింగ్‌ఖాన్‌ ఒకప్పటి ఇంట్లో అద్దెకు ఉండొచ్చు. ఆ ఇంటిని కొత్తగా మార్చారు. అందులోని ఇంటీరియర్స్‌ అన్నీ గౌరీఖానే స్వయంగా తీర్చిదిద్దారు. ఇంటి హాలులో షారుక్‌ కుటుంబానికి సంబంధించిన ఫోటోఫ్రేమ్‌లు కనువిందు చేస్తాయి. దిల్లీలో కింగ్‌ఖాన్‌ ఎన్నో ఏళ్లు నివసించిన ఆ ఇంటిని బుక్‌ చేసుకుని ఎంచక్కా ఎంజాయ్‌ చేయొచ్చు.

‘రబ్బరు హౌస్‌’లో జాలీగా...

‘మేరీ పాపిన్స్‌’తో పిల్లలనే కాదు పెద్దలనూ ఆకట్టుకున్న హాలీవుడ్‌ తార, గాయని జూలీ ఆండ్రూస్‌. ‘ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం 87 ఏళ్ల వయసున్న ఈ బ్రిటీష్‌ నటీమణి హాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్న సమయంలో న్యూయార్క్‌ పరిసరాల్లోని ఓ ఇంట్లో నివసించేవారు. ఈ భవనం ‘రబ్బర్‌ హౌస్‌’గా ప్రసిద్ధిచెందింది. కారణం ఈ భవనం వెలుపల ఒకలాంటి సింథటిక్‌ రబ్బరుతో అలంకరించడం. ఈ రెండంతస్తుల ఇంటిని 35 ఏళ్ల క్రితం నిర్మించారు. రెండు బెడ్‌రూమ్‌లు, ఓ డాన్స్‌ స్టూడియో, గాజుతో తీర్చిదిద్దిన వంటగది... కలప ఫ్లోరింగ్‌తో ఆకట్టుకుంటుంది. పర్వతాలు, పచ్చని చెట్ల మధ్యలో ఉన్న ఈ నివాసానికి పొడవాటి కిటికీలు మరింత అందాన్ని తెచ్చాయి. దాదాపు 3 హెక్టార్లలో విస్తరించిన ఈ నివాస సముదాయంలో జూలీ ఆండ్రూస్‌ చాలా కాలమే నివసించారు. ఆమె వినియోగించిన వస్తువులు కొన్ని ఇంకా అలాగే ఇంట్లో ఉన్నాయట. మన్‌హాటన్‌ నుంచి రెండు గంటల ప్రయాణంలో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ప్రాపర్టీని ఏడాదిలో కొన్నాళ్లు అద్దెకు ఇస్తున్నారు. ఒకరాత్రికి సుమారు వెయ్యి డాలర్లు వసూలు చేస్తున్నారు.

02.jpg

ఎలిజబెత్‌ జ్ఞాపకాల్లో...

ఎలిజబెత్‌ టేలర్‌... హాలీవుడ్‌ ఐకాన్‌. అపురూప లావణ్యరాశి, అతిలోకసుందరి... మరణించి దశాబ్దం దాటినా ఆమెకు సంబంధించిన సినిమాలు, జ్ఞాపకాలను అభిమానులు ఇంకా మర్చిపోలేదు. అందుకే ఎలిజబెత్‌ నివసించిన ఇంటిని ఎయిర్‌బీఎన్‌బీలో అద్దెకు పెట్టారు. కాలిఫోర్నియా సమీపంలో పామ్‌స్ర్పింగ్స్‌లోని ‘జువెల్‌ ఆఫ్‌ ది డెజర్ట్‌’... మూడు బెడ్‌రూమ్‌ల ప్రాపర్టీ. స్విమ్మింగ్‌పూల్‌తో పాటు ప్రశాంతమైన వాతావరణంలో దీనిని నిర్మించారు. అప్పట్లో ‘లిజ్‌’ వినియోగించిన వస్తువులు బంగ్లాలో అలాగే ఉంచడం విశేషం. తమ అభిమాన తార ఇంట్లో కొన్ని రోజులు గడపడానికి పర్యాటకులు ఎగబడుతున్నారట. అందుకే ఈ ప్రాపర్టీలో అడుగుపెట్టాలంటే కాస్త కష్టమైన వ్యవహారమే అంటున్నారంతా.

03.jpg

ఖరీదైన ‘మందిర’ం...

క్రికెట్‌ ప్రేమికులకు, టీవీక్షకులకు మందిరా బేడి సుపరిచితమే. ఆమె ముంబయిలోని మద్‌ ద్వీపంలో ఉన్న తన ‘బోగన్‌విలియా’ ఇంటిని ఎయిర్‌బీఎన్‌బీ యాప్‌ ద్వారా అద్దెకు ఇస్తోంది. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ అయిదు బెడ్‌రూమ్‌ల ఇంటి చుట్టూ బోగన్‌విలియా చెట్లే. అందుకే భవనానికి ఆ పేరు పెట్టారు. దీనిని లగ్జరీ హాలిడే హోమ్‌గా భావించాలి. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. పదిమంది అతిథుల దాకా ఇక్కడ బస చేసే సౌకర్యాలు ఉన్నాయి. మందిర తన అభిరుచికి తగ్గట్టుగా ఈ ఇంట్లోని ఫర్నీచర్‌, వాల్‌ హ్యాంగింగ్స్‌ను తీర్చిదిద్దింది. ఈ బంగ్లాలో ఉండాలంటే ఒక రాత్రికి రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

04.jpg

అందాల నటుడి ఆవాసం

ఒకే ఒక్క సినిమాతో అంతర్జాతీయంగా పేరుతెచ్చుకోవడమే కాకుండా... మగువల మనసు దోచుకున్నాడు ‘టైటానిక్‌’ హీరో లియోనార్డో డికాప్రియో. అత్యధిక పారితోషికం తీసుకునే డికాప్రియో తన సంపాదనతో ఎన్నో ఇళ్లు కొనుగోలు చేశాడు. వాటిలో కాలిఫోర్నియాలోని పామ్‌స్ర్పింగ్స్‌ మాన్షన్‌ ఒకటి. 1964లో నిర్మించిన ఈ ఇంటిని కొద్ది మార్పులతో 2014లో డికాప్రియో కొన్నాడు. ఇప్పటికీ ఆ మాన్షన్‌ ఆయన పేరు మీదే ఉంది. వీలు చిక్కినప్పుడల్లా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు గడుపుతాడట. ఆరు బెడ్‌రూమ్‌ల ఈ బంగ్లాలో ఒక్కో గది ఒక్కో థీమ్‌తో ఉండడం విశేషం. ఎల్‌ ఆకారంలోని కిచెన్‌ ఎంతో పెద్దది. బంగ్లా మొత్తంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది లివింగ్‌ రూమ్‌ గురించి. పెద్ద పియానో, రకరకాల సోఫాలు, కాక్‌టెయిల్‌ బార్‌, గోడంత స్ర్కీన్‌ ఉన్న టీవీ... అబ్బో ఇలా ఎన్నో విశేషాలు. ఇంకా టెన్నిస్‌ కోర్టు, స్విమ్మింగ్‌ పూల్‌, స్పాలు... ఇలా అన్ని రకాల సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దిన విల్లా ఇది. బంధుమిత్రులతో కలిసి ఒకేసారి పది మంది దాకా విడిది చేయగల సౌకర్యవంతమైన ఈ ప్రాపర్టీలో గడపాలంటే ఒక రాత్రికి 750 డాలర్లు చెల్లించాలి.

05.jpg

గోవా తీరంలో...

భారతదేశంలో తొలిసారిగా తన ఇంటిని ఎయిర్‌బీఎన్‌బీకి అద్దెకి ఇచ్చిన క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌. గోవాలోని తన ‘కాసా సింగ్‌’ ప్రాపర్టీలో బసచేసే అవకాశం అభిమానులకు కానుకగా ఇస్తున్నానని అంటాడు యువరాజ్‌. ‘కాసా సింగ్‌’ ను యువరాజ్‌ తన రెండో ఇల్లుగా భావిస్తాడు. ఇప్పటికీ ఖాళీ దొరికినప్పుడల్లా స్నేహితులు, బంధువులతో అక్కడ వాలిపోతాడు. ఆరుగురు ఒకేసారి బస చేసే వీలున్న రెండంతస్తుల ప్రాపర్టీ ఇది. స్విమ్మింగ్‌ పూల్‌తో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. అయితే ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఈ ఇంటిని అద్దెకి ఇస్తున్నాడు. గోవా సముద్ర తీరంలో అందంగా తీర్చిదిద్దిన ఈ ఇంటితో యువరాజ్‌కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న తేదీల్లో బుక్‌ చేసుకుని ఆ ఇంట్లో యువరాజ్‌ జ్ఞాపకాలతో మమేకం అవ్వొచ్చు.

Updated Date - 2023-03-12T11:31:03+05:30 IST