Jamaican tody : ముద్దొచ్చే ఈ పక్షులు అంతరించిపోతున్నాయట..!
ABN , First Publish Date - 2023-01-03T10:51:25+05:30 IST
పరిమాణంలో చిన్నగా కనిపించినా ఆకారంలో అచ్చం రామచిలకలానే పోలిఉండే ఈ పక్షులు చురుకైనవి.
జమైకన్ టోడీ ఇవి టోడస్ జాతికి చెందిన చిన్న పక్షులు. జంటలు జంటలుగా అడవులలో సందడిచేస్తూ కనిపించే జాతులు. వీటి అరుపు బిగ్గరగా "చుక్, చుక్, చుక్, చుక్" మని, సెకనుకు ఏడు నుండి పదిసార్లు అరుస్తాయి. ఇవి మొత్తం ఐదు జాతుల పక్షుల పోలికలతో ఉంటాయి. పరిమాణంలో చిన్నగా కనిపించినా ఆకారంలో అచ్చం రామచిలకలానే కనిపించే ఈ పక్షులు చురుకైనవి. ఆహారం సంపాదించుకోవడంలో కూడా వీటికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. కీటకాలను గాలిలో ఎగురుతూనే తింటాయి. నీటిని తాగే విధానం కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. కాకపోతే ఇవి అడవి పక్షలు మాత్రమే. చిలకల్లా పంజరాల్లో పెరిగే జాతి కాదు. ఇవి స్వేచ్ఛా జీవులు.
జమైకన్ టోడీ పక్షిని స్థానిక పేర్లలో రాస్తా పక్షి, రాబిన్,రాబిన్ రెడ్‌బ్రెస్ట్ అని ముద్దుగా పిలుస్తారు. ఇది చిన్న చంకీ పక్షి, సగటున 9 సెం.మీ పరిమాణంలో ఉంటాయి. బరువు విషయానికి వస్తే కేవలం 6.4 గ్రాములు మాత్రమే ఉంటాయి. ఆకారంలో మాత్రం చాలా ముద్దుగా ఆకుపచ్చని తలతో, ఎర్రటి గొంతు, పొడవాటి, వెడల్పయిన ఎరుపు బిల్ తో కనిపిస్తాయి.
జమైకన్ టోడీ పక్షులు జమైకాకు చెందినవి. ఇవి ద్వీపం అంతటా జంటగా ప్రయాణిస్తాయి. అటవీ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కువగా తేమతో కూడిన పర్వతాలలో తిరుగుతూ, పర్వతాల పగుళ్ళలో గుడ్లు పెడతాయి. సున్నపురాయి నేలల్లో తిరుగుతో గూళ్లను తయారు చేసుకుంటాయి. శుష్క సున్నపురాయి అడవులు, నీడ ఉన్న కాఫీ తోటలు, మడ అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి. డిసెంబరు నుండి జూలై వరకు సంతానోత్పత్తి కాలంలో 1 నుండి 4 తెల్లటి గుడ్లు పెడతాయి. ఈ పక్షులు కీటకాలు, కీటకాల లార్వాలను తింటాయి. అప్పుడప్పుడు పండ్లను కూడా తింటాయి. జమైకన్ టోడీ పక్షులు అంతరించే పక్షుల జాబితాలో చేరాయి. వాతావరణంలో మార్పులు, కాలుష్యం, అడవులు అంతరించిపోవడం కూడా వీటి మనుగడకు ఇబ్బంది కరంగా మారింది.