Butta Bomma Film Review: బుట్ట బొమ్మ కాదు... వట్టి బొమ్మ!
ABN , First Publish Date - 2023-02-04T16:06:42+05:30 IST
ఈమధ్య మలయాళం సినిమాలని తెలుగులో రీమేక్ చెయ్యడం పరిపాటి అయింది. పెద్ద స్టార్ సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ఎక్కువ మలయాళం సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చి వాటిని తెలుగులో చేస్తున్నారు. ఇంకా ఆసక్తికరం ఏంటి అంటే, ఆ మలయాళం సినిమాలు అన్నీ ఓ.టి.టి. లో ప్రేక్షకులు చూసేస్తున్నా కూడా రీమేక్ చెయ్యడం.
సినిమా: బుట్ట బొమ్మ
నటీనటులు : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, ప్రేమ్ సాగర్, నవ్యా స్వామి, పమ్మి సాయి, వాసు ఇంటూరి తదితరులు
ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు
సంగీతం : గోపీసుందర్, స్వీకర్ అగస్తి
నిర్మాతలు : నాగవంశీ, ఎస్.సాయి సౌజన్య
దర్శకత్వం : శౌరి చంద్రశేఖర్ రమేష్
-- సురేష్ కవిరాయని
ఈమధ్య మలయాళం సినిమాలని తెలుగులో రీమేక్ చెయ్యడం పరిపాటి అయింది. పెద్ద స్టార్ సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ఎక్కువ మలయాళం సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చి వాటిని తెలుగులో చేస్తున్నారు. ఇంకా ఆసక్తికరం ఏంటి అంటే, ఆ మలయాళం సినిమాలు అన్నీ ఓ.టి.టి. లో ప్రేక్షకులు చూసేస్తున్నా కూడా రీమేక్ చెయ్యడం. ఇప్పుడు 'కప్పేలా' (Kappela) అనే మలయాళం సినిమాని 'బుట్ట బొమ్మ' (Butta Bomma review) గా తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్ వంశీ, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) భార్య సాయి సౌజన్య (Sai Soujanya) నిర్మించారు. దీనికి శౌరి చంద్రశేఖర్ రమేష్ (Shourie Chandrasekhar Ramesh) దర్శకుడు, ఇది అతని మొదటి సినిమా. ఇందులో లీడ్ యాక్టర్స్ లో ఇద్దరు అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) మలయాళం అమ్మాయి, అలాగే అర్జున్ దాస్ (Arjun Das) తమిళ సినిమాలు చేసాడు.
Butta Bomma story కథ:
విశాఖపట్నం దగ్గర వున్న ఆరుకులో సత్య (అనిఖా సురేంద్రన్) అనే సాధారణ మధ్య తరగతి కుటుంబంకి చెందిన అమ్మాయి అమ్మ నాన్న, చెల్లెలుతో ఉంటూ ఉంటుంది. తల్లి టైలరింగ్, తండ్రి రైసు మిల్లులో పని చేస్తూ వుంటారు. చెల్లెలు స్కూల్ లో చదువుతూ ఉంటుంది. ఆమె జీవితం లో ఒక కెమెరా ఫోన్ కొనుక్కోవాలని, ఎందుకంటే దానితో రీల్స్ చేసి బాగా పాపులర్ అయిపోవాలని ఆమె కల. అమ్మకి సాయం చేస్తూ, పక్కింటి స్నేహితురాలితో మాట్లాడుతూ, కృష్ణయ్యని కొలుస్తూ అతి సాధారణంగా వెళుతున్న సత్య జీవితం ఒక రాంగ్ నెంబర్ చెయ్యటం తో మలుపు తిరుగుతుంది. ఆ రాంగ్ నెంబర్ వ్యక్తి పేరు మురళి (సూర్య వశిష్ఠ Surya Vashishta). అతను రాంగ్ నెంబర్ అని ఊరుకోక, ఆమె గొంతు బాగుంది ఆమెకి పదే పదే చేస్తూ ఉంటాడు, ఇలా ఇద్దరికీ పరిచయం పెరిగి ప్రేమలో పడతారు. ఆ మురళి అనే వ్యక్తి ఎవరో తెలీదు, మొహం కూడా చూడకుండా అతడిని ప్రేమిస్తుంది సత్య. అయితే సత్యను ఇష్టపడే బట్టల కొట్టు యజమానితో ఇంట్లో పెళ్లి నిశ్చయం చేయడంతో సత్య వెంటనే సూర్యను చూడటం కోసం విశాఖపట్నం వెళుతుంది. స్నేహితురాలు వద్దు అని వారిస్తున్నా వినకుండా విశాఖపట్నం వెళ్లిన సత్య, మురళి ని కలిసిందా? అక్కడ ఏమి జరిగింది? మురళి మంచివాడేనా? సత్య కి ఆర్కే (అర్జున్ దాస్) ఎలా పరిచయం అయ్యాడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అన్న విషయం వెండి తెర మీద చూడాల్సిందే. (#ButtaBommaReview)
విశ్లేషణ:
కథ గురించి కొత్తగా ఏమి లేదు. ఇది మలయాళం సినిమా 'కప్పేల' (Kappela remake) కి రీమేక్ కాబట్టి, అదే కథను దర్శకుడు రమేష్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఆసక్తికరం ఏంటి అంటే, తెలుగులో ఎలా చేసాడు, తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసాడా లేదా అన్నది. ఈ విషయం లో దర్శకుడు కొంచెం మాత్రమే కృతకృత్యుడు అయ్యాడని చెప్పొచ్చు. ఒరిజినల్ సినిమాలో కేవలం పాత్రలే కనిపిస్తాయి మనకి, అంత బాగా నటించారు, చూపించాడు దర్శకుడు అందులో. తెలుగులో అంతా బాగా లేకపోయినా కొంత వరకు బాగా చేశారనే చెప్పవచ్చు.
దర్శకుడు రమేష్ అరకు నేపధ్యం ఎంచుకొని ఆ చుట్టుపక్కల మనుషులు ఎలా వుంటారు, వాళ్ళ భాష ఇవన్నీ కొంచెం సహజంగానే ఉండేట్టు చూపించాడు. అయితే రాంగ్ నెంబర్ కి ఫోన్ చెయ్యడం, అతను తిరిగి చెయ్యడం, పొడుపు కథకి సమాధానం చెప్పడం, గొంతు బాగుంది అని ఇద్దరూ తెలియకుండా ఒకరికొకరు ప్రేమలో పడిపోవటం ఇలాటి సన్నివేశాలు నమ్మే విధంగా చూపించి ఉంటే బాగుండేది. ఆ థ్రెడ్ మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సత్య ఎవరికీ చెప్పకుండా విశాఖపట్నం వచ్చి ఫోన్ లో సంభాషించిన వ్యక్తిని కలవాలి అనుకోవటం అక్కడ ఇంకొక వ్యక్తి అర్జున్ దాస్ తారస పడటం ఇవన్నీ కూడా రెండో సగం లో బాగున్నాయి. అర్జున్ దాస్ వచ్చాక సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి సగం లో కొంచెం హాస్య సన్నివేశాలు మంచివి పెట్టి ఉంటే బాగుండేది.
ఇక నటీనటుల విషయానికి వస్తే, అనిఖా సురేంద్రన్ సత్య గా ఒక సాధారణ అమ్మాయిల ఒదిగిపోయింది. పల్లెటూరి నుండి వచ్చిన అమ్మాయి ఎంత అమాయకంగా ఉంటుందో చూపించింది. అలాగే సూర్య వశిష్ట కూడా ఆటో డ్రైవర్ గా చాల బాగా చేసాడు. అతనిలో రెండు కోణాలు బాగా చూపించాడు. ఇంకా సినిమాకి హైలైట్ అని చెప్పాలంటే మాత్రం రెండో సగం లో వచ్చిన అర్జున దాస్ అనే చెప్పాలి. అతని కంఠం, అందులో వున్న గంభీరత, దానికి తోడు అతని హావభావాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. అతను ఆ పాత్రలో బాగా లీనమయి చేసాడు, అందుకే అతని పాత్ర అంత బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ అంతా అతనే తీసుకున్నాడు. అతని గొంతే అతనికి పెద్ద ప్లస్ పాయింట్. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రల్లో బాగా సపోర్ట్ చేశారు.
మాటలు గణేష్ రావూరి బాగా రాసాడు. బాగున్నాయి. గుడిని, బడిని ఇంటికి తెచ్చుకోలేము మనమే వెళ్ళాలి లాంటివి చాలా వున్నాయి. బహుశా త్రివిక్రమ్ ప్రేరణ ఏమో అనుకుంటా. అయితే హాస్య సన్నివేశాలు ఇంకా బాగా రాస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది, అరకు చుట్టు పక్కల ప్రదేశాలు బాగా చూపించాడు. సంగీతం కూడా వినసొంపుగా వుంది. (#ButtaBomma)
చివరగా 'బుట్ట బొమ్మ' ని దర్శకుడు రమేష్ పాడు చేయకుండా ఒరిజినల్ అంత కాకపోయినా, బాగానే తీసాడు అని చెప్పాలి. సినిమాలో ఒక చిన్న సామజిక సమస్య కూడా వుంది. అయితే లీడ్ పెయిర్ గా తెలుగు నటీనటులను పెట్టి ఉంటే ఇంకా బాగుండేది ఏమో అనిపించింది. ఎందుకంటే మలయాళం సినిమా తెలుగులో రీమేక్ చేసినప్పుడు మళ్ళీ మలయాళం అమ్మాయిని పెట్టడం కన్నా, తెలుగు అమ్మాయిని పెట్టి ఉంటే బాగుండేదేమో. అయితే ఎవరి సమస్యలు వారివి!