Viral: ఈ ఆస్పత్రి ఎంత పని చేసింది..! ఒక్క మెసేజ్‌తో 8 వేల మంది రోగులకు భారీ షాక్..

ABN , First Publish Date - 2023-01-03T20:27:03+05:30 IST

పొరపాట్లు చేయడం ఎవరికైనా సహజమే. అయితే.. అనుకోకుండా జరిగే తప్పులు కూడా ఒక్కోసారి అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంటాయి.

Viral: ఈ ఆస్పత్రి ఎంత పని చేసింది..! ఒక్క మెసేజ్‌తో 8 వేల మంది రోగులకు భారీ షాక్..

ఇంటర్నెట్ డెస్క్: పొరపాట్లు చేయడం ఎవరికైనా సహజమే. అయితే.. అనుకోకుండా జరిగే తప్పులు కూడా ఒక్కోసారి అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంటాయి. బ్రిటన్‌కు(UK) చెందిన ఓ ఆస్పత్రి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆ ఆస్పత్రి పంపిన ఒక్క సందేశం పేషెంట్లకు ఊహించని షాకిచ్చింది. తమకు మరణం తప్పదని భావించిన వారందరూ గజగజా వణికిపోయారు. వారి క్రిస్మస్ ఉత్సాహాన్నంతా ఆవిరి చేసిన మెనేజ్ అది.

సౌత్ యార్క్‌షైర్‌లోని(South Yorkshire) ఆస్కర్న్ మెడికల్ ప్రాక్టీస్‌ ఆస్పత్రిలో క్రిస్మస్ సందర్భంగా ఓ అనూహ్యమైన తప్పిదం జరిగింది. లంగ్ క్యాన్సర్ ముదిరిందంటూ ఏకంగా 8 వేల మంది పేషెంట్లకు మెసేజ్‌లు వెళ్లాయి. ‘‘మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్(Aggressive Lung Cancer) ముదిరింది. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే స్థితికి చేరుకుంది.’’ అన్నది ఆ మెసేజ్ సారాంశం. అంతేకాకుండా.. మరణం అంచున్న ఉన్న వారు ప్రభుత్వ సాయం కోసం చేసుకునే దరఖాస్తుల కాపీలను కూడా వారికి పంపించింది. దీంతో.. ఒక్కసారిగా రోగుల్లో కలకలం రేగింది. ఆస్పత్రికి వేల సంఖ్యలో ఫోన్లు వచ్చాయి. కానీ స్పందించే వారే లేకపోవడంతో రోగుల్లో టెన్షన్ పెరిగిపోయింది.

ఈలోపు ఆస్పత్రి వర్గాలు జరిగిన తప్పును గుర్తించి మరో మెసేజ్ రోగులకు పంపించారు. ‘‘పొరపాటుకు మన్నించండి. మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పబోతే ప్రమాదవశాత్తూ ఇలాంటి సందేశాలు వెళ్లాయి. కాబట్టి.. మీ అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు(Merry Christmas)’’ అని రోగులకు మరో సందేశం అందింది. దాంతో పేషెంట్లు తాత్కాలికంగా కుదుటపడినప్పటికీ..జరగవలసిన నష్టం మాత్రం జరిగిపోయింది. ఆ తరువాత వారందరూ ఆస్పత్రి వర్గాలపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నిజంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిని ఈ మెసేజ్ ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందో గుర్తించారా అంటూ పలువురు ఆస్పత్రి వర్గాలపై ఫైరయ్యారు.

Updated Date - 2023-01-03T20:27:04+05:30 IST