Marriage: నెదర్లాండ్ ప్రియురాలితో ఉత్తరప్రదేశ్ యువకుడి పెళ్లి.. అదీ హిందూ సంప్రదాయంలో..
ABN , First Publish Date - 2023-12-02T11:42:04+05:30 IST
సమాజంలో కులాంతర, మతాంతర వివాహాల్ని చూశాం. ఖండంతార వివాహాల్ని చూశారా? ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఓ యువకుడు విదేశీ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా హిందూ సంప్రదాయం ప్రకారం..
లఖ్ నవూ: సమాజంలో కులాంతర, మతాంతర వివాహాల్ని చూశాం. ఖండంతార వివాహాల్ని చూశారా? ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఓ యువకుడు విదేశీ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యూపీలోని ఫతేపూర్ కి చెందిన హార్దిక్ ఉద్యోగం కోసం నెదర్లాండ్స్ కి వెళ్లాడు. అక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్ వైజర్ ఉద్యోగాన్ని సంపాదించాడు. అదే సమయంలో నెదర్లాండ్ దేశానికి చెందిన గాబ్రియేలా దుడాతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా హార్దిక్ ని ప్రేమించింది. ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు. అలా మూడు సంవత్సరాలు కలిసి జీవించారు. తరువాత విషయాన్ని ప్రేమికులిద్దరూ వారి కుటుంబ సభ్యులకు చెప్పారు.
దీంతో పెళ్లికి లైన్ క్లియర్ అయింది. నవంబర్ లో గాబ్రియేలాతో కలిసి హార్దిక్ భారత్ కి తిరిగివచ్చాడు. వారికి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం తెలిపారు. నవంబర్ 29న ఈ జంట ఫతేపూర్ లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకుంది. వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తన కుటుంబం గుజరాత్ లో నివసిస్తోందని డిసెంబర్ 3న అక్కడికి వెళ్లిపోతామని హార్దిక్ చెప్పాడు.
ఫతేపూర్ తమ పూర్వీకుల ఇల్లు కావడంతోనే అక్కడ వివాహం చేసుకున్నామన్నాడు. డిసెంబరు 11న గాంధీనగర్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి గాబ్రియేలా తండ్రి మార్సిన్ దుడా, ఆమె తల్లి బార్బరా దుడా, ఇతర కుటుంబ సభ్యులు హాజరవుతారని హార్దిక్ తెలిపాడు. భారత్ లో వేడుకల తరువాత డిసెంబర్ 25 న నెదర్లాండ్స్‌కు తిరిగి వస్తామని అక్కడ చర్చిలో క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకోనున్నట్లు చెప్పాడు.