Gujari Mahal : చరిత్ర చెప్పిన మూడు షరతుల ప్రేమకథ...!

ABN , First Publish Date - 2023-02-07T15:36:08+05:30 IST

ఎవరో కొందరికి మాత్రమే దక్కించుకునే అవకాశం కలుగుతుంది.

Gujari Mahal : చరిత్ర చెప్పిన మూడు షరతుల ప్రేమకథ...!
love stories

ప్రేమ మాటలకందని గొప్ప అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రేమ పుట్టి, గిలిగింతలు పెట్టే ఉంటుంది. ఈ అనుభూతి కోసం ఆరాటపడినా ఎవరో కొందరికి మాత్రమే దక్కించుకునే అవకాశం కలుగుతుంది. ఈ ప్రేమ కొందరు దక్కించుకున్నది. మరికొందరు చేయిజార్చుకున్నది. అయితే ఈ ప్రేమనే భావన ఒకరితో మాత్రమే కలుగుతుంది. దీనిలో త్యాగాలు, తపనలు, విరహాలు, వైరాగ్యాలు అన్నీ ఉంటాయి. ప్రేమకోసం పోరాటాలు, యుద్ధాలు జరిగిన చరిత్ర మనది. మన చరిత్రే చాలా కథలను చెపుతుంది. ఎవరు ఆకాలంలో అంత గాఢంగా ప్రేమలో పడ్డారనేది తెలుసుకోవలంటే ఆ చరిత్రను తవ్వాల్సిందే..

మాటలకందని ప్రేమను ప్రపంచమంతా పండుగ చేసుకునే ప్రేమికుల దినోత్సవం వాలెంటైన్స్ డే 2023 దగ్గరకొస్తున్న నేపథ్యంలో మీ కోసం ఆంధ్రజ్యోతి వెబ్ ఎడిషన్ ద్వారా విభిన్న ప్రేమకథలను అందిస్తున్నాం....

ఈ ప్రేమకథలను మోసిన ఆ కోటలు, స్మారక చిహ్నాలు, మహల్ గోడలను అడిగితే బోలెడు కథలను మనముందు ఉంచుతాయి. అలాంటివే ఈ కథలు కూడాను.

రాజా మాన్ తోమర్ & మృగనయని - గుజారి మహల్, గ్వాలియర్

మధ్యప్రదేశ్ లో హస్తకళా ఎంపోరియానికి మృగనయని అని పేరు. ఆ అందమైన గోడలపై ఓ అందమైన స్త్రీ చిత్రం చూపులను నిలిపేస్తూ కనిపిస్తుంది. మృగనయని అంటే జింక వంటి కన్నులు కలిగిన స్త్రీ అని అర్థం. ఈ స్త్రీ ఆ అందమైన కన్నుల వెనుక ఏకథ దాగి ఉందోనని చూసే ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఆమె వివరాల్లోకి వెళ్లే ముందు గ్వాలియర్ కోట గురించి తెలుసుకోవాలి.

గ్వాలియర్ కోటకు రాజు మాన్ సింగ్ తోమార్. అతని తొమ్మిదో భార్య మృగనయని. రాజా మాన్ సింగ్ వేటకు వెళ్ళినపుడు అతనికి గుజర్ అనే అమ్మాయి ఎదురైంది. ఆ అమ్మాయి గేదెలను మేపుతూ కనిపించింది. అవి పోట్లాడుతూ కనిపించాయి. రాజు రథాన్ని ఆపి వాటిని విడదీసాడు. పక్కనే నిలబడి ఉన్న ఆమె అందానికి ముగ్ధుడైపోయి తనని తన కోటకి రాణిని చేస్తానని పెళ్ళికి ఒప్పించ చూశాడు. దానికి గుజర్ మూడు షరతులు పెట్టింది. మొదటి షరతు ఏంటంటే తన ఇతర రాణులతో కాకుండా తనని గొప్పగా చూడాలని, రాజు తనతో సమంగా హోదాను కల్పిస్తూ తనకోసం కోటను నిర్మించాలని కోరిందట. రాజు తన గుజర్ రాణి కోసం నిర్మించే ప్యాలెస్ గుజారీ మహల్ అయింది. ఈ గ్వాలియర్ కోట నుంచి గుజారీ మహల్ చూడవచ్చు. ఇది కోట కింది పట్టణంలో ఉంది.

ఇక రెండో షరతు ఏంటంటే రాజు ఎక్కడికి వెళ్ళినా ఆమె అతని వెంటే ఉండాలని. అది వేట, సభ, యుద్ధం సందర్భం ఏదైనా ఆమె తనతోనే ఉండాలనేది గుజర్ పెట్టిన రెండో షరతు. గ్వాలియర్ కోట నుండి గుజారి మహల్ కు వెళ్ళేందుకు ప్రత్యేకమైన మార్గం కూడా ఉంది. అంటే రాజు కోటకు వచ్చిన ప్రతిసారీ, అలాగే కోట నుంచి తిరిగి వెళ్ళిన ప్రతిసారీ ఆదారినే ఉపయోగించేవాడు.

మూడవ షరతు ఏమిటంటే.. గుజర్ నివసిస్తున్న గ్రామానికి పక్కగా ప్రవహిస్తున్న నది నుండి తన ప్యాలెస్ కు నీటిని సరఫరా చేయమని కోరుతుంది. ఈ కారణంగానే కోట పైకి నీటిని తీసుకువెళ్ళడం కష్టంగా ఉండటం వల్ల రాజు కోట పక్కగా కాకుండా దిగువన గుజార్ ప్యాలెస్ నిర్మించడానికి ఇది కూడా ప్రధాన కారణం.

WhatsApp Image 2023-02-07 at 2.50.08 PM.jpeg

రాజా మాన్ సింగ్ తోమార్ గుజార్ పెట్టిన షరతులన్నీ తీర్చి తనతో గుజార్ ప్యాలెస్ కు తీసుకువచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం తనతోనే వెంటబెట్టుకుని తను ఎక్కడికి వెళితే అక్కడకు మృగనయనిని తీసుకువెళుతూ ఉండేవాడు. ఇద్దరూ చాలా కాలం అదే ప్రేమతో జీవించారు. ఈరోజున గుజారి మహల్ ఒక పురావస్తు మ్యూజియంగా మారింది. ఇది గ్వాలియర్ పాత పట్టణంలో ఉంది. కాలం ఎంతగా మారినా గుజరాయ్ మహల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నీలిరంగు పలకలతో అందంగా కనిపిస్తుంది. ప్రేయసి కోరికను తీర్చి చరిత్రలో మరణం మాత్రమే వేరుచేసిన ప్రేమకథగా నిలిచి,. రాజా మాన్ సింగ్, మృగనయని ప్రేమకథ అజరామరం అయింది.

Updated Date - 2023-02-07T15:50:54+05:30 IST