Viral Video: వారెవ్వా.. ఏం టెక్నిక్ గురూ.. ఇలాంటి టీచర్లు ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవడం ఖాయం..!
ABN , First Publish Date - 2023-11-02T17:51:27+05:30 IST
విద్యార్థులు సులభంగా కెమెస్ట్రీ ఫార్ములాలు గుర్తుపెట్టుకునేందుకు ఓ టీచర్ పాట సాయంతో రూపొందించిన టెక్నిక్ తాలుకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కెమిస్ట్రీ అంటే చిన్నతనంలో చాలా మందికి ఓ మిస్టరీలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫార్ములాలు, వాటి పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా మందికి అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ, సరైన టీచర్ కనుక ఉంటే కష్టమైన అంశాలను కూడా సులువుగా అరటిపండు వలిచి చేతులో పెట్టినట్టు వివరించగలరు. అలాంటి టీచర్లు అరుదుగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వచ్చేస్తున్నారు. కొత్త కొత్త టెక్నిక్‌లతో కష్టమైన అంశాలను కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఓ కెమిస్ట్రీ టీచర్(Chemistry) వీడియో నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది.
సాధారణంగా ఎదైనా గుర్తుండిపోవాలంటే ముందు అది మనకు నచ్చాలి..మనసుకు తాకాలి. అప్పుడు పెద్ద కష్టపడకుండానే మెదడు వాటిని గ్రహిస్తుంది. జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. పాటలు ఇందుకు మంచి ఉదాహరణ. చిన్నప్పుడు ఎప్పుడో విన్న పాటల లిరిక్స్ కూడా ఒక్కసారి ట్యూన్ వినగానే గుర్తుకు వచ్చేస్తాయి. అయితే, మనం చెప్పుకుంటున్న టీచర్ కూడా సరిగ్గా ఇలాంటి ఫార్ములానే ఉపయోగించారు. కష్టమైన రసాయనాల పేర్లు వాటి ఫార్ములాలను విద్యార్థుల సులభంగా గుర్తు పెట్టుకునేందుకు పాట సాయంతో ఓ టెక్నిక్ రూపొందించాడు. ఓ భోజపురి పాటలో లిరిక్స్‌తో రసాయనాల పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెబుతూ ఓ చిన్న వీడియో చేశాడు. ఈ టెక్నిక్‌తో కెమిస్ట్రీ ఫార్ములాలను సులభంగా నేర్చుకున్న విద్యార్థులు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు(Chemistry teacher viral song technique to help student easily remeber formulas).
నెటిజన్ల నుంచి ఈ వీడియో విపరీతంగా స్పందన వస్తుండటంతో వీడియో వైరల్‌గా మారింది. విద్యార్థులకు చదువు మరింత సులభంగా అర్థమయ్యేందుకు టీచర్ పడుతున్న కష్టం అనేక మందిని ఇంప్రెస్ చేసింది. ఇలాంటి టీచర్ ఒక్కరున్నా చాలు అన్ని సబ్జెక్టులు విద్యార్థులకు సులభంగా అర్థమైపోతాయంటూ అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.