Viral Meme Dog: నవ్వులు పూయించిన ఆ చింటు ఇక లేడు.. ఆ భయంకరమైన వ్యాధితో మృతి చెందిన వైరల్ మీమ్ డాగ్
ABN , First Publish Date - 2023-08-20T16:23:26+05:30 IST
సోషల్ మీడియా పుణ్యమా అని మనుషులతో పాటు మూగ జీవాలు కూడా పాపులారిటీ గడించాయి. ప్రజల్లో తమదైన ముద్ర వేయగలిగాయి. మీమ్ వరల్డ్‌తో ఒక ప్రత్యేక స్థానాన్ని...
సోషల్ మీడియా పుణ్యమా అని మనుషులతో పాటు మూగ జీవాలు కూడా పాపులారిటీ గడించాయి. ప్రజల్లో తమదైన ముద్ర వేయగలిగాయి. మీమ్ వరల్డ్‌తో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించగలిగాయి. అలాంటి వాటిల్లో చీమ్స్ (12) (తెలుగులో చింటుగా ఫేమస్) అనే శునకం కూడా ఉంది. ఇది ఇంటర్నెట్‌లో నవ్వులు పూయించింది. కానీ ఇప్పుడు ఈ శునకం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
కొంతకాలం నుంచి లుకేమియాతో బాధ పడుతున్న చీమ్స్.. శనివారం సర్జరీ జరుగుతున్న టైంలో తుదిశ్వాస విడిచింది. థొరాసెంటెసిస్ శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో నిద్రలోకి జారుకున్న చీమ్స్.. నిద్రలోనే కన్నుమూసింది. మళ్లీ తిరిగి లేవలేదు. నిజానికి.. చీమ్స్ యజమానులు మరో చికిత్స చేయాలని అనుకున్నారు కానీ, అప్పటికే ఆలస్యం అయిపోయింది. చింటుగాడు ఇక లేడన్న విషయాన్ని ఆ శునకం యజమాని ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా వెల్లడించింది. సుధీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఆ యజమాని.. ఎవరూ నిరాశ చెందొద్దని, చీమ్స్ పంచిన ఆనంద క్షణాల్ని మాత్రమే గుర్తు చేసుకోవాలని కోరింది.
కాగా.. చీమ్స్ అసలు పేరు బాల్టెజ్. దీనికి ఏడాది వయసు ఉన్నప్పుడు.. హాంకాంగ్‌కు చెందిన ఒక కుటుంబం దీనిని దత్తత తీసుకుంది. చూడ్డానికి చాలా క్యూట్‌గా, ఇతర శునకాల కన్నా కాస్త భిన్నంగా ఉండటంతో.. ఒక ఫోటోగ్రాఫర్ దీనిని ఫోటోలను క్లిక్‌మనిపించాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలా నెట్టింట్లోకి వచ్చిన ఈ చింటు ఫోటోలు.. అనతి కాలంలోనే వైరల్ అయ్యాయి. 2017 చివర్లో ఫోటోలు విపరీతంగా చక్కర్లు కొట్టాయి. దాంతో.. ఆ ఏడాదిలో టాప్ మీమ్‌గా చీమ్స్‌కు గుర్తింపు దక్కింది. మన తెలుగు మీమ్ పేజెస్‌లోనూ ఈ శునకంపై ఎన్నో మీమ్స్ వస్తూనే ఉన్నాయి.
మీమర్స్‌కి ఎంతో స్టఫ్ ఇవ్వడం, నెటిజన్లను కడుపుబ్బా నవ్వించడంతో.. చీమ్స్ మృతిపై నెట్టింట్లో అందరూ సంతాపం ప్రకటిస్తున్నారు. నువ్వు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినా, మా మీమ్ పేజెస్‌లో మాత్రం ఎప్పుడూ బ్రతికే ఉంటావంటూ ఉద్వేగభరితమైన పోస్టులు పెడుతున్నారు. నువ్వు చిందించిన చిరునవ్వుల్ని ఎప్పటికీ మర్చిపోమంటూ మంచి క్షణాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అటు.. కరోనా మహమ్మారి సమయంలో కోట్లాదిమందికి నవ్వులూ పూయించి చింటు సహాయం చేశాడని, ఇప్పుడు అతని మిషన్ పూర్తయ్యిందంటూ అతని యజమాని ఆ పోస్టులో చెప్పిన మాట అందరి మనసుల్ని కదిలించేసింది.