Viral Video: పెట్రోల్ ధరకు విసిగిపోయి పాకిస్తాన్ లో బైక్ ను ఏమి చేస్తున్నారో చూడండి..
ABN , First Publish Date - 2023-02-17T12:55:00+05:30 IST
అక్కడ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు ధర భగ్గుమంటోంది. ఆ ధరలు చూసి అక్కడి సగటు పౌరులు తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు.
పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అక్కడ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు ధర భగ్గుమంటోంది. ఆ ధరలు చూసి అక్కడి సగటు పౌరులు తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళితే..
IMF(ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, International Monetary Fund) నుండి బెయిలవుట్ ప్యాకేజీని పొందలేక పాకిస్తాన్ ఇప్పుడు దివాళా తీసే స్టేజ్ లో ఉంది. ఈ క్రమంలో అక్కడ అన్ని ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా లీటరు పెట్రోల్ ధర 272రూపాయలకు చేరింది. దీంతో స్థానిక పాకిస్తానీ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడల్లా పాకిస్తాన్ ఓటమితో అక్కడి ప్రజలు టీవీలు బద్దలు కొట్టడం సోషల్ మీడియాలో చూసేవాళ్ళం. ఇప్పుడు పెట్రోల్ ధర కారణంగా ఒక వ్యక్తి తన ఆగ్రహాన్ని అణుచుకోలేక తన బైక్ ను కర్ర తీసుకని ధ్వంసం చేయడం, దాన్ని పక్కనే ఉన్న పొలంలోకి తోసేయడం ట్విట్టర్ వీడియోలో చూడచ్చు.
పాకి్స్తాన్ లో ఏర్పడిన సంక్షోభం కారణంగా అక్కడ ధరలు తెలిసి మన భారతీయులు అవాక్కవుతున్నారు. లీటర్ పాల ధర 250రూపాయలు, కేజీ చికెన్ ధర 700 నుండి 800 రూపాయలు, 5కేజీల గోధుమపిండి 1000రూపాయలుగా ఉన్నాయి. తినీ తినక, కొనడానికి డబ్బు లేక నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. పాకిస్తాన్ మీద కోపంగా ఉండే ప్రజలు కొందరు ఈ వీడియోను ఫన్నీగా చూసినా అక్కడి ధరలు తెలిసి అయ్యో పాపం అంటున్నారు.