G20 New Delhi summit: అసలు జీ20 కూటమి అంటే ఏమిటి? దీని లక్ష్యాలు ఏమిటి?
ABN , First Publish Date - 2023-09-08T16:52:39+05:30 IST
దేశరాజధాని న్యూఢిల్లీలో జీ20 (G20) సందడి నెలకొంది. శని, ఆదివారాల్లో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు సభ్యదేశాల అధినేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సైతం శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు.
దేశరాజధాని న్యూఢిల్లీలో జీ20 (G20) సందడి నెలకొంది. శని, ఆదివారాల్లో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు సభ్యదేశాల అధినేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సైతం శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. ఏకంగా 20 దేశాలు అధినేతలు పాల్గొనబోతున్న ఈ జీ20 సదస్సు ఎప్పుడు ఏర్పాటయ్యింది? లక్ష్యాలు ఏమిటి? ఈసారి భారత్‌లో ఎందుకు జరుగుతున్నాయి? అనే ఆసక్తికరమైన విషయాలను ఒకసారి గమనిద్దాం..
‘జీ20’ లేదా ‘గ్రూప్ ఆఫ్ 20’ అనేది కొన్ని దేశాల ప్రభుత్వాల కలయికతో ఏర్పడిన ఒక వేదిక. జీ20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిపి మొత్తం 20 దేశాల ప్రభుత్వాలు ప్రతినిధులుగా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పుల తీవ్రత తగ్గింపు, సుస్థిరాభివృద్ధి వంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సవాళ్లను అధిగమించేందుకు ఈ కూటమి పనిచేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అత్యధిక దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. పారిశ్రామికీకరణ చెందిన, వర్ధమాన దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ దేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థూల ఉత్పాదకతలో (Gross world product) 80 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింటి రెండో వంతు, ప్రపంచ విస్తీర్ణంలో 60 శాతాలుగా ఉన్నాయి.
పలు ప్రపంచ ఆర్థిక సంక్షోభాలకు స్పందనగా 1999లో జీ20 కూటమి ఏర్పాటైంది. అయితే 2008 నుంచి ఏడాదికోసారి సమావేశమవ్వడం మొదలైంది. ప్రభుత్వ అధినేత లేదా ఆర్థిక మంత్రి లేదా విదేశాంగశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఆయా దేశాల తరపున పాల్గొంటారు. ఇక ఇతర దేశాలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు, నాన్-గవర్నమెంటల్ సంస్థలను సదస్సులకు హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు. కొన్నింటికి శాశ్వత ఆహ్వానం ఉంటుంది.
సభ్యదేశాలు ఇవే...
2023 నాటికి ఈ గ్రూపులో 20 సభ్యదేశాలు ఉన్నాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, దక్షిణకొరియా, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీఅరేబియా, సౌతాఫ్రికా, తుర్కియే, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఈ జాబితాలో ఉన్నాయి. అతిథి ఆహ్వానితుల జాబితాలో స్పెయిన్, ఐక్యరాజ్యసమితి, ప్రపంచబ్యాంక్, ఆఫ్రికన్ యూనియన్, ఏసియాన్ ఉన్నాయి.
కాగా రోటేషనల్‌లో భాగంగా ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత రాజధాని న్యూఢిల్లీ వేదికవబోతోంది. గతేడాది 2022లో ఇండోనేషియాలో ఈ సమావేశాలు జరిగాయి. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సదస్సు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించనుంది. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల మధ్య ఆర్థిక ప్రగతిని విస్తృతం చేసేందుకు అవసరమైన చర్యలపై అధినేతలు చర్చించనున్నారు.