British Nurse: నవజాత శిశువులను పొట్టన పెట్టుకున్న నర్సు.. ఈ దారుణాల వెనుక కారణాలు ఇవేనా?
ABN , First Publish Date - 2023-08-19T21:44:36+05:30 IST
బ్రిటిష్ నర్సు దారుణాల వెనకు గల కారణాలు వెలికి తీసే క్రమంలో దర్యాప్తు అధికారులకు కీలక ఆధారాలు దొరికాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవజాత శిశువులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ బ్రిటన్ నర్సు ఉన్మాదిలా మారి పొట్టనపెట్టుకుంది. జీవితాల్ని కాపాడాల్సిన తన వృత్తినైపుణ్యాలను చిన్నారులపై యమపాశాలుగా ప్రయోగించింది. ఆమె పాపం పండి నేరం రుజువైంది. రాళ్ల లాంటి కఠిన హృదయాలు సైతం కరిగిపోయేంతటి స్వచ్ఛమైన బోసినవ్వుల చిన్నారులు నిందితురాలిని ఎందుకు కదిలించలేకపోయారు? అసలు ఆమె మానసిక స్థితి ఏమిటీ? ఇవీ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిన ప్రశ్నలు. ఈ దిశగా దర్యా్ప్తు సంస్థలు కొన్ని కీలక ఆధారాలు వెలికి తీశాయి.
వ్యక్తిగత జీవితంలో అసంతృప్తి..
చిన్నారులను పొట్టనపెట్టుకున్న బ్రిటన్ నర్సు లూసీ లెట్బీ జీవితంలో అనేక అసంతృప్తులు ఉన్నాయని చెప్పేందుకు పలు ఆధారాలు బయటపడ్డాయి. నేరం జరిగిన కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. వార్డులోని చిన్నారులకు చికిత్స చేసేందుకు డాక్టర్ వచ్చినప్పుడు ఆయనతో లూసీకి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరూ పలుమార్లు ప్రేమసందేశాలు ఒకరికొకరు పంపించుకున్నారు. ఆ డాక్టర్ దృష్టిలో పడేందుకే లూసీ ఈ దారుణాలకు పాల్పడిందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది.
చిన్నారులను ఆనారోగ్యం పాలు చేసి లూసీ థ్రిల్ పొందేదని, చనిపోయిన బిడ్డలను చూసుకుని తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంటే ఆమె థ్రిల్ ఫీలయ్యేదని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. లూసీ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆమె మానసిక స్థితికి అద్దం పట్టే మరికొన్ని ఆధారాలు లభించాయి. ‘‘నాకు ఎప్పటికీ పెళ్లి కాదు. పిల్లలు పుట్టరు. కుటుంబాన్ని కలిగి ఉంటే వచ్చే భావన కూడా నాకు తెలీదు’’ లూసీ రాసిపెట్టుకున్న ఓ చిట్టీని అధికారులు గుర్తించారు. అయితే, నవజాత శిశువుల హత్యల వెనకు కారణాలను పూర్తిస్థాయిలో వెలికి తీసే ఆధారాలు లభ్యం కానప్పటికీ లూసీ చేసిన దారుణానికి కచ్చితమైన సాక్ష్యాలు లభ్యమయ్యాయి. వచ్చే సోమవారం కోర్టు ఆమెకు శిక్ష ఖరారు చేయనుంది.