Pakistan economic crisis: కిలో చికెన్ రూ.650.. గ్యాస్ సిలెండర్ ధర రూ.10 వేలు.. పాకిస్థాన్‌లో దుర్భర పరిస్థితులు..

ABN , First Publish Date - 2023-01-06T19:56:56+05:30 IST

పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయి.. దేశ ఆర్థిక పరిస్థితి (Pakistan economic crisis) పతనం అంచున ఉంది.. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించలేని దీన స్థితిలో పాక్ ప్రభుత్వం కొట్టుమిట్టులాడుతోంది..

Pakistan economic crisis: కిలో చికెన్ రూ.650.. గ్యాస్ సిలెండర్ ధర రూ.10 వేలు.. పాకిస్థాన్‌లో దుర్భర పరిస్థితులు..

పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయి.. దేశ ఆర్థిక పరిస్థితి (Pakistan economic crisis) పతనం అంచున ఉంది.. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించలేని దీన స్థితిలో పాక్ ప్రభుత్వం కొట్టుమిట్టులాడుతోంది.. ఆర్థికంగా గాడిన పడేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న కొద్దీ పరిస్థితులు రోజురోజుకూ పతనమవుతుయి.. విదేశీ మారక నిల్వలు (Foreign Exchange ) వేగంగా క్షీణిస్తున్నాయి.. ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు కేవలం 5.6 బిలియన్ డాలర్లు మాత్రమే. పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడే పాకిస్థాన్‌కు ఈ నిల్వలు కేవలం మూడు వారాల వరకు మాత్రమే సరిపోతాయి.

ప్రస్తుతం సామాన్యుడికి నిత్యావసర సరుకులు అందడం చాలా కష్టంగా మారిపోయింది. కిలో చికెన్ ధర ఏకంగా రూ.650కి చేరింది. ఇక, వంట గ్యాస్ సిలెండర్ కావాలంటే ఏకంగా పదివేల రూపాయలు ఖర్చవుతోంది. దీంతో ఆ దేశ ప్రజలు ప్లాస్టిక్‌ కవర్లలో గ్యాస్‌ నింపుకుని ప్రమాదకర పరిస్థితుల్లో వంట చేసుకుంటున్నారు. 15 కిలోల గోధుమ పిండి బ్యాగ్ ధర ఏకంగా రూ.2050కి చేరింది. ఆహార పదార్థాలు మాత్రమే కాకుండా పెట్రోల్‌, డీజిల్‌, కరెంటు ఇలా అన్నింటి రేట్లు కొండెక్కాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌ ద్రవ్యోల్బణం (Inflation) రేటు 24.5 శాతానికి చేరుకుంది. డాలరుతో పోలిస్తే ప్రస్తుతం పాక్ రూపాయి విలువ రూ.228కి పడిపోయింది. మిత్రదేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి పాకిస్థాన్‌కు ఆశించినంత సహాయం లభించడం లేదు.

ప్రస్తుత పాక్ పరిస్థితికి కారణాలేంటి?

పాకిస్థాన్ కొన్ని ఆహార పదార్థాలు మినహా మిగతా వాటి కోసం పూర్తిగా దిగుమతుల పైనే ఆధారపడుతుంది. పైగా అక్కడి రాజకీయ అస్థిరత, తీవ్రవాద కార్యకలపాలు అభివృద్ధికి అడ్డుం పడుతుంటాయి. గతేడాది జూన్ నుంచి అక్టోబర్ మధ్య వరుసగా వచ్చిన భారీ వరదలు దేశాన్ని మరింత అతలాకుతలం చేశాయి. గతేడాది వచ్చిన వరదల వల్ల దాదాపు 30 బిలియన్ డాలర్ల నష్టం ఎదురైనట్టు అంచనా. 3.3 కోట్ల మంది ప్రజలు వరద తాకిడికి గురయ్యారట. వరదల కారణంగా ఎగుమతులు మరింత సన్నగిల్లి, దిగుమతులు భారీగా పెరిగిపోయాయి. దీంతో డాలర్లు వేగంగా తరిగిపోవడం ప్రారంభమైంది. కొద్దిరోజుల క్రితం అమెరికాలోని పాక్‌ రాయబార కార్యాలయాన్ని ప్రభుత్వం వేలం వేయడంతో అక్కడి సంక్షోభం గురించి ప్రపంచానికి క్షుణ్నంగా అర్థమైంది.

పాకిస్థాన్ కొన్నేళ్లుగా వివిధ సంస్థల నుంచి తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో అవన్నీ భారీ జరిమానాలు విధించాయి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు తగ్గించడం, పౌరులకు ఇచ్చే సబ్సిడిల్లో కోతలు విధించడం, విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించడం వంటి పనులు చేస్తోంది. అలాగే కరెంట్, ఇంధన ఆదా కోసం షాపింగ్ మాల్స్, కల్యాణ మండపాలు, మార్కెట్లను మూసేసింది (Pakistan forced to shut malls, markets, wedding halls).

Updated Date - 2023-01-06T19:59:57+05:30 IST