Viral: మహిళ చేసిన పనికి ఒక్కసారిగా కన్‌ఫ్యూజ్ అయిపోయిన దున్నపోతు.. ఏం చేయాలో తెలీక..

ABN , First Publish Date - 2023-10-06T21:10:28+05:30 IST

బైసన్ (దున్నపోతు, ఆంబోతులను పోలిన జంతువు) దాడి చేసేందుకు మీదకు వస్తుండటంతో భయపడిపోయిన మహిళ ఒక్కసారిగా కింద కూలబడి చనిపోయినట్టు నటించింది. తానే చేయకుండా మహిళకు ఏమైందో అర్థం కాక బైసన్ కన్‌ఫ్యూజ్ అయిపోయింది. దీంతో, ఆమెను వదిలిపెట్టి బైసన్ మరోవైపు వెళ్లిపోవడంతో మహిళ ప్రాణాలు నిలిచాయి ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viral: మహిళ చేసిన పనికి ఒక్కసారిగా కన్‌ఫ్యూజ్ అయిపోయిన దున్నపోతు.. ఏం చేయాలో తెలీక..

ఇంటర్నెట్ డెస్క్: అడవి జంతువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు చెబుతూనే ఉన్నా కొందరు పెడచెవిన పెట్టి ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటారు. అలాంటి సందర్భాల్లో అతి తక్కువ మంది మాత్రమే అపాయం నుంచి ఉపాయంగా గట్టెక్కుతున్నారు. మరణం అంచులవరకూ వెళ్లిన ఓ మహిళ అప్పటికప్పుడు పన్నిన ఉపాయం అనుకున్న ఫలితాన్ని ఇవ్వడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది.


సెలవుల సందర్భంగా ఓ మహిళ బైసన్ ( ఓ రకమైన దున్నపోతు) ఉన్న జాతీయవనానికి వెళ్లింది. అప్పటికే ఆ ప్రాంతంలో జనాల సందడి ఎక్కువవడంతో బైసన్‌లు ఇబ్బంది పడుతున్నాయి. ఒత్తిడికి లోనవుతున్నాయి. అక్కడున్న ఓ భారీ దున్నపోతుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో దున్నపోతుకు తిక్కరేగడంతో ఆమె వెంట పడింది. అయితే, మహిళ పక్కనే ఉన్న మరో పురుషుడు వేగంగా పరిగెడుతూ దూరంగా వెళ్లిపోయాడు. దీంతో, బైసన్ దృష్టి మహిళపై పడింది. అసలే నెమ్మదిగా పరిగెడుతున్న మహిళ కాలికి ఏదో తగలడంతో వెంటనే కిందపడిపోయింది. ఆ క్షణంలో ఆమె తెలివిగా ఆలోచించి చనిపోయినట్టు నటించింది. చలనం లేకుండా నేలపై పడుకుండి పోయింది(Woman plays dead to escape from charging bison). మహిళ హఠాత్తుగా అలా ఎలా కూలబడిపోయిందో పాపం బైసన్‌కు కూడా అర్థం కాక ఒక్క క్షణం కన్‌ఫ్యూజ్ అయిపోయింది. కాసేపు అక్కడే నిలబడి మహిళను పరిశీలించింది. ఈ లోపు చుట్టుపక్కల వారు దున్నపోతువైపు పెద్దగా అరుస్తు దాని దృష్టి మరల్చడంతో అది మరోవైపు వెళ్లిపోయింది. ఆ తరువాత ఆ మహిళ లేచి తన దారిన తాను వెళ్లిపోయింది.


నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మహిళ సమయస్ఫూర్తి, పాదరసం లాంటి తెలివితేటలే ఆమెను కాపాడాయని చెబుతున్నారు. అయితే, అడవి జంతువుతో సెల్ఫీ తీసుకునేందుకు మహిళ ప్రయత్నించడాన్ని అనేక మంది తప్పుపట్టారు. విపరీతంగా పెరిగిపోతున్న సెల్ఫీ సంస్కృతి అనర్థాలకు దారితీస్తోందంటూ విమర్శలు సంధించారు. నిబంధనలు పాటించకపోతే ఇలాగే జరుగుతుందని మరికొందరు ముక్తాయించారు.

Updated Date - 2023-10-06T21:15:42+05:30 IST