IND vs PAK: బ్యాడ్ న్యూస్.. మ్యాచ్ రిజర్వ్‌ డేకు వాయిదా.. ఇక టీమిండియాకు చుక్కలే!

ABN , First Publish Date - 2023-09-10T21:12:28+05:30 IST

అనుకున్నదే జరిగింది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్నమ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం రద్దైంది. దీంతో మిగతా మ్యాచ్‌ను రిజర్వ్ డే అయినా సోమవారం నిర్వహించనున్నారు.

IND vs PAK: బ్యాడ్ న్యూస్.. మ్యాచ్ రిజర్వ్‌ డేకు వాయిదా.. ఇక టీమిండియాకు చుక్కలే!

కొలంబో: అనుకున్నదే జరిగింది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం రద్దైంది. దీంతో మిగతా మ్యాచ్‌ను రిజర్వ్ డే అయినా సోమవారం నిర్వహించనున్నారు. ఆదివారం మ్యాచ్ ఎక్కడి వరకు జరిగిందో అక్కడి నుంచే సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. అంటే 50 ఓవర్ల పూర్తి మ్యాచ్ జరగనుంది. కాగా నేడు వర్షం అంతరాయం కల్గించే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 147 పరుగులు చేసింది. దీంతో రేపు అక్కడి నుంచి మ్యాచ్ తిరిగి ప్రారంభంకానుంది. సాధారణ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకే మ్యాచ్ ప్రారంభమవుతుంది. కానీ రేపు కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఒక వేళ సోమవారం కూడా ఆట జరగపోతే మ్యాచ్‌ను రద్దు చేసి రెండు జట్లకు చెరో పాయింట్ ఇవ్వనున్నారు. అయితే టీమిండియా మంగళవారమే శ్రీలంకతో మ్యాచ్ ఆడాల్సింది. దీంతో టీమిండియా వరుసగా మూడు రోజులపాటు విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడనుంది. ఇది భారత ఆటగాళ్లను తీవ్రంగా అలసటకు గురి చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా టీమిండియా ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉంటాయి.


ఇక వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్ (17) ఉన్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ధాటిగా ఆడిన వీరిద్దరు మొదటి వికెట్‌కు 13.2 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినప్పటికీ క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడాడు. మరోవైపు గిల్ మాత్రం ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో గిల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో గిల్‌కు ఇది 8వ హాఫ్ సెంచరీ కాగా.. రోహిత్ శర్మకు 50వ హాఫ్ సెంచరీ.


అయితే వీరిద్దరు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ భాగస్వామ్యాన్ని 17వ ఓవర్‌లో పాక్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ విడదీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్.. ఫహీమ్ అష్రఫ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 121 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు. ఆ కాసేపటికే షామీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో గిల్ కూడా ఔటయ్యాడు. 52 బంతులు ఎదుర్కొన్న గిల్ 10 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. దీంతో 123 పరుగులకు టీమిండియా ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. ఇక జట్టు స్కోర్ 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగుల వద్ద ఉండగా.. వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత రెండు సార్లు ఆగినప్పటికీ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. దీంతో అంపైర్లు ఓవర్లు కుదించి మ్యాచ్ కొనసాగించడానికి ప్రయత్నించారు. కానీ 8 గంటల 35 నిమిషాలకు వర్షం మళ్లీ ప్రారంభవడంతో చేసేదేమి లేక సోమవారానికి వాయిదా వేశారు.

Updated Date - 2023-09-10T21:36:57+05:30 IST