Chetan Sharma: చేతన్ శర్మ... నాడు మియాందాద్ సిక్సర్.. నేడు హిట్ వికెట్
ABN , First Publish Date - 2023-02-17T20:49:18+05:30 IST
chetan sharma miandad last ball six 1986 sharjah match Chetan Sharma: చేతన్ శర్మ... నాడు మియాందాద్ సిక్సర్.. నేడు హిట్ వికెట్
అది 1986 వేసవి కాలం.. ఇప్పుడంటే మనందరం ఎండాకాలం క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చూస్తున్నాం కానీ, మూడున్నర దశాబ్దాల కిందట అయితే వేసవిలో క్రికెట్ కావాలంటే ‘‘షార్జా’’ వెళ్లాల్సిందే. అప్పట్లో అబ్దుల్ రెహ్మాన్ బుఖాతిర్ చొరవతో అక్కడ మాత్రమే ఎండాకాలం క్రికెట్ మ్యాచ్‌లు జరిగేవి.
ఇందులో శ్రీలంక లాంటి జట్లు కూడా పాల్గొన్నప్పటికీ.. భారత్- పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉండే మజానే వేరు. అటు ఇమ్రాన్, మియాందాద్, ఇటు సన్నీ, కపిల్.... 1980ల్లో భారత జట్టు పేరు చెబితే గుర్తొచ్చేది కపిల్ దేవ్, సునీల్ గావస్కర్. రవిశాస్త్రి, అజహరుద్దీన్ వీరి తర్వాత కొంతకాలానికి జట్టులోకి వచ్చారు. ఇక అప్పటి పాకిస్థాన్ జట్టులో జావెద్ మియాందాద్, ఇమ్రాన్ ఖాన్ ప్రముఖులు. అందుకని భారత్-పాక్ తలపడితే మజా వేరుగా ఉండేది. కాగా, తటస్థ వేదిక మీద మ్యాచ్ జరిగినా..రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రికత్తల రీత్యా ఎప్పటిలాగే అభిమానులు ఉత్కంఠగా చూసేవారు. పాకిస్థాన్ చేతిలో ఓటమిని అసలు సహించేవారు కాదు. మరోవైపు క్రికెట్ కారణంగా చాలా ఏళ్ల పాటు షార్జా పేరు జనంలో నానింది. కానీ, 2000 సంవత్సరం తర్వాత ఫిక్సింగ్ కలకలం దాని ప్రతిష్ఠను దిగజార్చింది. ద్వైపాక్షిక, త్రైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మన జట్టును పంపేందుకు మొగ్గుచూపలేదు. ఇదే సమయంలో కొన్నాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కావడం.. అది కూడా వేసవిలోనే కావడంతో క్రికెట్ మ్యాచ్ ల పరంగా షార్జా వెనుకబడి పోయింది. అయితే, కొవిడ్ సమయంలో ఐపీఎల్, ఉగ్రవాదం కారణంగా పాకిస్థాన్ లో ఇతర జట్లు ఆడలేని పరిస్థితుల్లో, ఆసియా కప్ వంటి టోర్నీలకు షార్జా, యూఏఈ ఉపయోగపడుతున్నాయి.
అది గుండెను గాయపర్చిన మ్యాచ్...
భారత్ -పాక్ మ్యాచ్ అంటే ఏ టోర్నీలో అయినా ఉండే ప్రత్యేకతే వేరు. దేశ విభజన సమయం నుంచే అది అలా వచ్చిందంతే. అయితే, 1980ల్లో మన జట్టు కంటే పాకిస్థాన్ జట్టు బలంగా ఉండేది. మానసికంగానూ వారిదే పైచేయి అన్నట్లుండేది. అడపాదడపా భారత్ గెలిచినా ఎక్కువసార్లు పైచేయి దాయాదిదే అయ్యేది. ఇలాంటి సమయంలోనే 1986లో షార్జాలో ఆస్ట్రలేసియా కప్ (షార్జా కప్) జరిగింది. భారత్ - పాక్ ఫైనల్ చేరాయి. ఈ మ్యాచ్‌లో చాలావరకు భారత్‌దే పైచేయి. కానీ, ఫలితం మాత్రం మనకు చేదును మిగిల్చింది. ఆ ఓటమి కొన్ని సంవత్సరాల పాటు భారత అభిమానులను మానసికంగా వెంటాడింది.
అసలు నాడు ఏం జరిగింది?
1986 ఏప్రిల్ 18న భారత్-పాక్ మధ్య ఆస్ట్రలేసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్లు క్రిష్ణమాచారి శ్రీకాంత్ (80 బంతుల్లో 75, 8ఫోర్లు, 2 సిక్స్ లు), సునీల్ గావస్కర్ (134 బంతుల్లో 92, 6 ఫోర్లు), వన్ డౌన్ బ్యాట్స్ మన్ దిలీప్ వెంగ్ సర్కార్ (64 బంతుల్లో 50, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కాగా, ఛేదనలో పాకిస్థాన్ ను పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ చేతన్ శర్మ మొదట్లోనే దెబ్బకొట్టాడు. ముదస్సర్ నజర్ (5)ని అతడు వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరో ఎండ్ లో కపిల్ దేవ్ (1/45), మదన్ లాల్ (2/53), మణీందర్ సింగ్ (1/36) కూడా వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్ 110/తో నిలిచింది. మరో ఐదు వికెట్లు కూడా పడ్డాయి. కానీ, ఒక్కడు మాత్రం అడ్డుగోడలా నిలబడ్డాడు. అతడే జావెద్ మియాందాద్. చివరి వరకు క్రీజులో నిలిచిన మియాందాద్ (114 బంతుల్లో 116, 3 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ కొట్టాడు.
ఆ సిక్స్ కలకాలం....
ఇన్నింగ్స్ చివరి ఓవర్ 5వ బంతికి 242/9. ఆ జట్టు కప్ గెలవాలంటే చివరి బంతికి ఫోర్ లేదా సిక్స్ కొట్టాలి. బౌలర్ చేతన్ శర్మ. అయితే, చేతన్ అప్పటికే మ్యాచ్‍లో మెరుగ్గా బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో చివరి ఓవర్‌ను అతడికే ఇచ్చారు. ఈ క్రమంలో చివరి బంతికి పాక్ ఫోర్, లేదా సిక్స్ కొడితేనే గెలుపు అనే పరిస్థితి రావడం.. క్రీజులో మియాందాద్ ఉండడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కాగా, జట్టును గెలిపించే బాధ్యతలో బ్యాట్స్‌మన్ ఆడలేని విధంగా.. చేతన్ చివరి బంతిని యార్కర్ వేసేందుకు ప్రయత్నించాడు. కానీ, అది ఫుల్ టాస్ అయింది. మియాందాద్ ఆబగా అందుకుని సిక్స్ కొట్టాడు. దీంతో భారత్ ఓడిపోయింది. కప్ చేజారింది. అలా ఈ మ్యాచ్ ఫలితం మనవాళ్లను చాలాకాలం పాటు వెంటాడింది. ఇప్పటికీ పాత తరం వారు దీని గురించి చెబుతుంటారు. కాగా, నాడు మియాందాద్ సిక్స్‌తో చేతన్ శర్మ సైతం వార్తల్లో నిలిచాడు. మళ్లీ ఇప్పుడు చేజేతులా సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవిని పోగొట్టుకుని వార్తలకెక్కాడు. వాస్తవానికి ఇటీవల టి20 ప్రపంచ కప్, అంతకుముందు ఆసియా కప్‌లో టీమిండియా పరాజయాల నేపథ్యంలో సెలక్షన్ కమిటీని తప్పించారు. కానీ, చేతన్‌ను మాత్రం కొనసాగించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. జట్టు గురించి, ఆటగాళ్ల గురించి అనవసర వ్యాఖ్యలు చేసి అవకాశాన్ని అతడు చేజార్చుకున్నాడు.
ఎక్కడివాడు ఈ చేతన్ శర్మ...
57 ఏళ్ల చేతన్ శర్మ పుట్టింది పంజాబ్ లోని లుధియానాలో. కానీ, రంజీల్లో హరియాణా, బెంగాల్ జట్లకు ఆడాడు. టీమిండియా వెటరన్ యశ్ పాల్ శర్మ ఇతడి బంధువే. కాగా, చేతన్ కేవలం 17 ఏళ్ల వయసులోనే 1984లో టీమిండియాలోకి వచ్చాడు. పొట్టిగా, బక్కగా ఉండే ఇతడు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం కష్టమే అనుకున్నారు. కానీ, దానిని తప్పని నిరూపించాడు. తన ఐదో బంతికే పాక్ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ ను ఔట్ చేశాడు. ఐదేళ్లపాటు కపిల్ దేవ్‌తో కొత్త బంతిని పంచుకున్నాడు. 1985 శ్రీలంక సిరీస్‌లో 14 వికెట్లు, 1986లో ఇంగ్లండ్ తో రెండు టెస్టుల సిరీస్ లో 16 వికెట్లు పడగొట్టి మెరిశాడు. అనంతరం వెస్టిండీస్ సిరీస్‌లోనూ రాణించాడు.
1989లో ఇంగ్లండ్‌తో వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు పంపితే సెంచరీతో ఆశ్చర్యపరిచాడు. కాగా ఆ ఏడాదితోనే అతడి టెస్టు కెరీర్ ముగిసింది. అయితే, 1994-95 సీజన్ వరకు వన్డేలు ఆడాడు. రిటైరయ్యాక టీవీ కామెంటేటర్ గానూ రాణించాడు. మొత్తమ్మీద 23 టెస్టుల్లో 61 వికెట్లు, 65 వన్డేల్లో 67 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చేతన్ ఏకంగా 433 వికెట్లు తీయడం విశేషం.