Virushka: మైదానంలో విరాట్ కోహ్లీ ప్రభంజనం.. అనుష్క శర్మ ముద్దుల వర్షం
ABN , First Publish Date - 2023-11-15T19:17:41+05:30 IST
ఏ రంగంలోనైనా మన సొంత మనుషులు విజయవంతంగా దూసుకుపోతుంటే.. అందులో కలిగే ఆనందమే వేరు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎగిరి గంతులేస్తాం. ప్రపంచాన్ని మర్చిపోయి, ఆ మధురానుభూతిని ఆస్వాదిస్తాం. మైదానంలో విరాట్ కోహ్లీ...
ఏ రంగంలోనైనా మన సొంత మనుషులు విజయవంతంగా దూసుకుపోతుంటే.. అందులో కలిగే ఆనందమే వేరు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎగిరి గంతులేస్తాం. ప్రపంచాన్ని మర్చిపోయి, ఆ మధురానుభూతిని ఆస్వాదిస్తాం. మైదానంలో విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించినప్పుడల్లా.. అనుష్క శర్మ కూడా అలాగే ఎంజాయ్ చేస్తుంటుంది. అతడు బంతిని బౌండరీకి పంపిస్తే చాలు.. అనుష్క నుంచి వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. ఇక అతడు అర్థశతకం లేదా శకతం చేస్తే మాత్రం.. తాను మైదానంలో వేలాదిమంది మధ్యలో ఉన్నానని సంగతి మర్చిపోయి, ఎంతో ఉత్సాహంతో ఆ సందర్భాన్ని ఆస్వాదిస్తుంది. కెమెరాల ముందు ముద్దుల వర్షం (ఫ్లయింగ్ కిస్) కురిపించేస్తుంది. తాజాగా వాంఖడే స్టేడియంలోనూ అదే దృశ్యం రిపీట్ అయ్యింది.
బుధవారం (15-11-23) భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో విజృంభించాడు. మొదట్లో క్రీజులో కుదుర్కునేందుకు కొంత సమయం తీసుకున్నా.. ఆ తర్వాత చెలరేగి ఆడాడు. కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించేలా పరుగుల సునామీ సృష్టించాడు. ఈ క్రమంలో.. ఈ మ్యాచ్ చూసేందుకు మైదానానికి వచ్చిన అనుష్క శర్మ ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేసింది. అటు కోహ్లీ షాట్ కొడితే, ఇటు అనుష్క నుంచి జోష్‌తో నిండిన రియాక్షన్ వచ్చింది. ఈ అందమైన దృశ్యాలు కెమెరామెన్లు తన కెమెరాలో బంధించగా.. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా.. కోహ్లీ సెంచరీ చేసి వన్డేల్లో 50 శతకాల రికార్డ్‌ని నమోదు చేసినప్పుడు, అనుష్క ఫుల్ జోష్‌తో ముద్దుల వర్షం కురిపించేసింది. అటు.. కోహ్లీ సైతం రివర్స్‌లో ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. ఈ మధురమైన క్షణం కెమెరాలో రికార్డ్ అవ్వగా.. అభిమానులు నెట్టింట్లో షేర్ చేస్తున్నారు.
ఇదిలావుండగా.. భీకరమైన ఫామ్‌లో ఉన్న రన్ మెషీన్ ఈ మ్యాచ్‌లో నమోదు చేసిన సెంచరీతో సరికొత్త చరిత్ర లిఖించాడు. తన వన్డే కెరీర్‌లో 50వ శతకం పూర్తి చేసి, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును చెరిపేసి.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా అవతరించాడు. మరో విశేషం ఏమిటంటే.. కేవలం 292 మ్యాచ్‌ల్లోనే కోహ్లీ 50 సెంచరీలు పూర్తి చేశాడు. మొత్తం 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల సహకారంతో 117 పరుగులు చేశాడు. కేవలం 50 శతకాల రికార్డ్ మాత్రమే కాదండోయ్.. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక స్కోరు చేసిన రికార్డ్‌ని కూడా కోహ్లీ తిరగరాశాడు. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు నమోదు చేస్తే.. 2023 వరల్డ్ కప్‌లో కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో 709 పరుగులు చేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.