Sandeep Lamichhane: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని.. బెయిలుపై బయట ఉన్న క్రికెట్ మళ్లీ క్రీజులోకి!
ABN , First Publish Date - 2023-02-11T21:01:22+05:30 IST
అత్యాచార ఆరోపణలతో అరెస్టై క్రికెట్ దూరమైన నేపాల్ క్రికెట్
కఠ్మాండు: అత్యాచార ఆరోపణలతో అరెస్టై క్రికెట్ దూరమైన నేపాల్ క్రికెట్ జట్టు స్టార్ పేసర్ సందీప్ లమిచ్చనే(Sandeep Lamichhane) తిరిగి మైదానంలో దిగేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం బెయిలుపై ఉన్న సందీప్ వరల్డ్ కప్ లీగ్ 2 ముక్కోణపు సిరీస్(World Cup League 2 tri-series)లో తిరిగి బంతి పట్టనున్నాడు. ఈ మేరకు క్రికెట్ నేపాల్ (Cricket Nepal)ప్రకటించింది. గతేడాది ఆగస్టులో కఠ్మాండు హోటల్‌లో 17 ఏళ్ల బాలికపై సందీప్ అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
ఈ నెల 14-21 మధ్య నమీబియా(Namibia), స్కాట్లాండ్(Scotland)తో జరగనున్న ముక్కోణపు ట్రోఫీ కోసం నేపాల్ క్రికెట్ అసోసియేషన్ జట్టును ప్రకటించింది. ఇందులో 22 ఏళ్ల సందీప్ లమిచ్చినేకు స్థానం కల్పించింది. ఈ నెల మొదట్లోనే లమిచ్చినేపై ఉన్న నిషేధాన్ని బోర్డు తొలగించడంతో జట్టులో అతడికి స్థానం ఖాయమని ఊహించారు.
బోర్డు గతంలో అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేసిందని, ఇప్పుడు సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో పాటు క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు చతుర్ బహదూర్ చంద్(Chatur Bahadur Chand) ఈ నెల 1న ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.
గతేడాది అక్టోబరు 6న కఠ్మాండు ఎయిర్‌పోర్టులో సందీప్ అరెస్టయ్యాడు. అప్పటి నుంచి కస్టడీలోనే ఉన్నాడు. ఇటీవల బెయిలుపై విడుదలయ్యాడు. 2018లో నేపాల్ క్రికెట్‌కు వన్డే అంతర్జాతీయ హోదా లభించింది. ఐపీఎల్(IPL)లో ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) సందీప్‌ను కొనుగోలు చేశాక ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) ఆడుతున్న సందీప్ తనపై ఆరోపణలను కొట్టిపడేశాడు. తాను అమాయకుడినని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ తర్వాత అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో బోర్డు అతడిని సస్పెండ్ చేసింది.