Sachin Tendulkar: 50వ పడిలోకి సచిన్.. ఈ విషయాలు మీకు తెలుసా?
ABN , First Publish Date - 2023-04-23T21:06:38+05:30 IST
టీమిండియా క్రికెట్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న
ముంబై: టీమిండియా క్రికెట్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ ఈ నెల 24తో 50వ పడిలోకి ప్రవేశిస్తున్నాడు. క్రికెట్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించి తన పేరుపై లెక్కలేనని రికార్డులు రాసుకున్న సచిన్ బర్త్ డే నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుకుందాం.
* ఫిబ్రవరి 1988లో సచిన్ టెండూల్కర్-వినోద్ కాంబ్లీ కలిసి 664 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పోటీ క్రికెట్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఆ మ్యాచ్‌లో సచిన్ 326 పరుగులతో అజేయంగా నిలిచాడు.
* నవంబరు 1989లో 16 ఏళ్ల వయసులో సచిన్ కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు మాత్రమే చేసిన సచిన్, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అవకాశం రాలేదు.
* ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. సియాల్‌కోట్‌లో జరిగిన టెస్టులో వకార్ యూనిస్ బౌలింగులో సచిన్ ముక్కుకు గాయమైంది. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఆడి అర్థ సెంచరీ చేసి జట్టును రక్షించాడు.
* ఆగస్టు 14, 1990లో ఓల్డ్ మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో సచిన్ తొలి సెంచరీ నమోదు చేశాడు.
* సెప్టెంబరు 9, 1994లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 110 పరుగులు చేశాడు. 79 మ్యాచ్‌ల తర్వాత సచిన్‌కు ఇది తొలి సెంచరీ.
* 1996 వన్డే ప్రపంచకప్‌లో 523 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
* ఆగస్టు 1996లో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
* 1 ఏప్రిల్ 1998లో ఆస్ట్రేలియాతో కొచ్చిలో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
* 22 ఏప్రిల్ 1998 షార్జాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 143 పరుగులు చేశాడు. రెండు రోజుల తర్వాత జరిగిన మరో మ్యాచ్‌లో 134 పరుగులు చేసి భారత జట్టుకు కోకాకోలా కప్ అందించిపెట్టాడు.
* 23 మే 1999లో ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కెన్యాతో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో సచిన్ 101 బంతుల్లో 140 పరుగులు చేశాడు.
* 2003 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు చేశాడు. షోయబ్ అక్తర్ బౌలింగులో సచిన్ కొట్టిన సిక్స్ ఆ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆ టోర్నీలో సచిన్ 673 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
* 1 డిసెంబరు 2006లో సౌతాఫ్రికాతో తొలి, ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ 10 పరుగులు మాత్రమే చేశాడు.
* 24 ఫిబ్రవరి 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో అజేయంగా 200 పరుగులు చేశాడు. ఫలితంగా వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
* 2 ఏప్రిల్ 2011 తన హయాంలో భారత్‌కు ప్రపంచకప్ రావాలన్న సచిన్ కల సాకారమైంది. దీనికి తోడు ఆ మ్యాచ్ ముంబైలో జరగడం అతడికి తీయని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
16 మార్చి 2012 బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 114 పరుగులు చేసిన సచిన్ మొత్తం 100 సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
* నవంబరు 15-16, 2013లో తన చివరి మ్యాచ్, కెరియర్‌లో 200వ టెస్టు ఆడాడు. వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన ఆ టెస్టులో సచిన్ 74 పరుగులు చేసి టెస్టుల నుంచి తప్పుకున్నాడు.