Ricky Ponting: బెంగళూరు చేతిలో ఓటమి తర్వాత పాంటింగ్ స్పీచ్ వైరల్!
ABN , First Publish Date - 2023-04-17T17:09:18+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023)లో ఢిల్లీ(Delhi Capitals) పరాజయాల నుంచి
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023)లో ఢిల్లీ(Delhi Capitals) పరాజయాల నుంచి బయటపడడం లేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస పరాజయాలు వేధిస్తున్నప్పటికీ ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) మాత్రం ఏమాత్రం నిరాశ చెందలేదు సరికదా.. ఆటగాళ్లలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశాడు. తనకెప్పుడూ క్షమాపణలు చెప్పొద్దని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)ను కోరాడు.
క్రికెట్ ప్రపంచంలో పాంటింగ్ అత్యంత గౌరవనీయమైన కోచ్‌గా పేరుగాంచాడు. అయితే, ప్రస్తుతం మాత్రం అతడికి కాలం కలిసి రావడం లేదు. జట్టును వరుస పరాజయాలు వేధిస్తున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల పేర్లను పాంటింగ్ వ్యక్తిగతంగా ప్రస్తావించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ తనకు క్షమాపణలు చెప్పవద్దని కుల్దీప్ యాదవ్‌తో అన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో పేలవ ప్రదర్శన తర్వాత రికీ పాంటింగ్‌కు కుల్దీప్ యాదవ్ క్షమాపణలు చెప్పాడు.
అయితే, మైదానంలో జరిగిన దానికి క్షమాపణలు చెప్పొద్దని కుల్దీప్‌ను పాంటింగ్ కోరాడు. కుల్దీప్ 4 ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇది అద్భుత ప్రదర్శన అని ప్రశంసించాడు. పాంటింగ్ స్పీచ్ వీడియోను ఢిల్లీ కేపిటల్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
4 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చిన ఢిల్లీ ఆల్‌రౌండర్ లలిత్ యాదవ్‌పైనా పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. అయితే, జట్టు ఫీల్డింగ్ విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. మున్ముందు మ్యాచుల్లో ఫీల్డింగ్‌లో అదరగొట్టాలన్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన ఢిల్లీ కేపిటల్స్ అన్నింటిలోనూ ఓటమి పాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.