Lalit Modi: ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్‌పై ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ

ABN , First Publish Date - 2023-01-14T16:55:10+05:30 IST

ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ (Lalit Modi) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకడం

Lalit Modi: ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్‌పై ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ

న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ (Lalit Modi) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకడం, న్యూమోనియా ఎటాక్‌ కారణంగా లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. రెండువారాల్లో రెండుసార్లు కరోనా సోకడంతోపాటు న్యూమోనియా కూడా అటాక్ చేయడంతో ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు.

తనకు రెండు వారాల్లో రెండుసార్లు కరోనా సోకిందని, దీనికి న్యూమోనియా కూడా తోడవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు. ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్‌కు వచ్చి ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. ఇప్పటికీ ఆక్సిజన్ సపోర్ట్‌తోనే ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఆ పోస్టు చూసిన మాజీ ప్రేయసి సుస్మితా సేన్(Sushmita Sen) సోదరుడు రాజీవ్ సేన్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)తదితరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. మనీ లాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ 2010 నుంచి లండన్‌లోనే ఉంటున్నారు.

లలిత్ మోదీ గతేడాది జులైలో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్టు చెబుతూ ఆమెతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసి సంచలనం రేపారు. ప్రస్తుతం తామిద్దరం డేటింగులో ఉన్నామని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా చెప్పారు. అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ, వీరిద్దరూ దూరమయ్యారు.

Updated Date - 2023-01-14T16:55:11+05:30 IST