Share News

India vs South Africa: శతక్కొట్టిన సంజూ శాంసన్.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

ABN , Publish Date - Dec 21 , 2023 | 08:42 PM

బొలాండ్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో ఆడుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భాగంగా భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) శతక్కొట్టడం..

India vs South Africa: శతక్కొట్టిన సంజూ శాంసన్.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

India vs South Africa 3rd ODI: బొలాండ్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో ఆడుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భాగంగా భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) శతక్కొట్టడం, తిలక్ వర్మ (52) అర్థశతకంతో రాణించడం వల్లే.. టీమిండియా అంత స్కోరు చేయగలిగింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్లిద్దరు అద్భుత ప్రదర్శన కనబరిచి, జట్టుని మెరుగైన స్కోరు దిశగా తీసుకెళ్లారు. తక్కువ స్కోరు భారత్ చాపచుట్టేస్తుందని అనుకున్న టైంలో.. వీళ్లిద్దరు వెన్నెముకలా నిలిచారు. గౌరవప్రదమైన స్కోరు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లను ధీటుగా ఎదుర్కంటూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో ఎగబడ్డారు. వీళ్లిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి ఏకంగా 116 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఎట్టకేలకు.. తనకొచ్చిన అవకాశాన్ని సంజూ శతకంతో బాగా వినియోగించుకున్నాడు. ఇది అతనికి వన్డేల్లో తొలి శతకం.


ఇక చివర్లో వచ్చిన రింకూ సింగ్ కూడా ఎప్పట్లాగే తన మెరుపు ఇన్నింగ్స్‌తో రప్ఫాడించాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినప్పటికీ.. ఉన్నంతవరకూ సౌతాఫ్రికా బౌలర్లకు దడదడలాడించాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సుల సహకారంతో 38 పరుగులు చేశాడు. రింకూ సింగ్ దూకుడుగా ఆడటాన్ని చూసి.. భారత జట్టు 300 పరుగుల మైలురాయినా దాటేస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. దురదృష్టవశాత్తూ అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. నాంద్రే బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. దాదాపు బౌండరీ లైన్ వద్ద రీజా హెండ్రిక్స్ దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికొస్తే.. హెండ్రిక్స్ మూడు, నాంద్రే 2 వికెట్లు పడగొట్టగా.. విలియమ్స్, వియాన్, కేశవ్ మహారాజ్ తలా వికెట్ తీశారు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. సౌతాఫ్రికా 297 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి.. ఈ స్కోరుని భారత బౌలర్లు డిఫెండ్ చేయగలరా? తాడోపేడో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్ నెగ్గాలంటే, భారత బౌలర్లు సత్తా చాటాల్సిందే.

Updated Date - Dec 21 , 2023 | 08:42 PM