IND vs NZ: కివీస్‌తో తొలి టీ20లో పోరాడి ఓడిన టీమిండియా.. రెండో టీ20 గెలవాలంటే ఏం మారాలంటే..
ABN , First Publish Date - 2023-01-27T23:53:17+05:30 IST
రాంచీ వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. వన్డేల్లో అదరగొట్టిన టీమిండియా టీ20లో మాత్రం చతికిలపడింది. కివీస్ నిర్దేశించిన 177 పరుగుల..
రాంచీ వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. వన్డేల్లో అదరగొట్టిన టీమిండియా టీ20లో మాత్రం చతికిలపడింది. కివీస్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య సాధనలో పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసిన టీమిండియా కివీస్ చేతిలో 21 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ 28 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టినా టీమిండియాకు ఓటమి తప్పలేదు.
టీమిండియా బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు గిల్, ఇషాన్ కిషన్ వరుసగా 7,4 పరుగులు చేసి వికెట్లు సమర్పించుకున్నారు. రాహుల్ త్రిపాఠి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత.. సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు, హార్థిక్ పాండ్యా 21 పరుగులు చేసి ఔట్ కావడంతో లక్ష్య ఛేదనలో టీమిండియా వెనుకబడింది. ఆ సమయంలో.. వాషింగ్టన్ సుందర్ 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేసి ఆశలు రేకెత్తించినప్పటికీ ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో సుందర్ కూడా క్యాచ్‌గా వెనుదిరగడంతో న్యూజిలాండ్‌ను గెలుపు వరించింది.
న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్‌వెల్ 2, శాంట్నర్ 2, ఫెర్గ్యూసన్ 2 వికెట్లతో రాణించారు. జాకోబ్ డఫ్ఫీ, ఇస్ సోధికి చెరో వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ కాన్వే 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో మిచెల్ 30 బంతుల్లో ఐదు సిక్స్‌లు, 3 ఫోర్లతో 59 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లకు మిచెల్ చుక్కలు చూపించాడని చెప్పక తప్పదు. కివీస్ విజయంలో మిచెల్ చేసిన 59 పరుగులదే కీలక పాత్ర అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లతో రాణించగా, అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీశారు. బ్రేస్‌వెల్ రనౌట్ కావడంతో కివీస్ ఆరు వికెట్లు కోల్పోయింది. మొత్తం మీద.. వన్డేల్లో వైట్ వాష్ అవడంతో న్యూజిలాండ్ కసిగా ఆడి తొలి టీ20లో టీమిండియాకు షాక్ ఇచ్చింది. రెండో టీ20 నాటికి టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో మెరుగుపడితేనే కివీస్ లాంటి జట్టు మీద విజయం సాధించగలం.
టీ20 వరల్డ్‌కప్ అనంతరం హార్దిక్ కెప్టెన్సీలో జట్టుకిది వరుసగా మూడో టీ20 సిరీస్ కావడం గమనార్హం. అలాగే మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని కివీస్ జట్టు ఆడిన గత 10 టీ20ల్లో ఎనిమిది గెలిచింది. అయితే ఇవన్నీ ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌లాంటి చిన్నజట్లపై సాధించినవే. కానీ.. తొలి టీ20లో టీమిండియాను ఓడించి తామేం తక్కువ కాదని న్యూజిలాండ్ టీ20 టీం నిరూపించింది