Hardik Pandya: గెలుపు ఆనందం ఆవిరి.. పాండ్యాకు భారీ జరిమానా!

ABN , First Publish Date - 2023-04-14T16:59:28+05:30 IST

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఆటగాళ్లు నియమావళిని

Hardik Pandya: గెలుపు ఆనందం ఆవిరి.. పాండ్యాకు భారీ జరిమానా!

మొహాలీ: ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఆటగాళ్లు నియమావళిని ఉల్లంఘిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అలాంటి పనే చేసి జరిమానాకు గురయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయడంలో గుజరాత్ టైటాన్స్ విఫలమైంది. దీంతో ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆ జట్టు కెప్టెన్‌కు మ్యాచ్ ఫీజులో కోత పడింది. ఫలితంగా గెలుపు ఆనందం ఆవిరైంది.

ఈ సీజన్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలమైన ఫా డుప్లెసిస్, సంజు శాంసన్ ఇప్పటికే జరిమానా ఎదుర్కొన్నారు. ఇప్పుడు పాండ్యా కూడా ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడడంతో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ చర్యలు తీసుకుంది. రెండోసారి కూడా ఇదే విధమైన తప్పిదం చేస్తే జరిమానా అప్పుడు రెట్టింపు అవుతుంది. అలాగే, మిగిలిన ఆటగాళ్లకు కూడా మ్యాచ్ ఫీజులో రూ. 6 లక్షలు, లేదంటే 24 శాతం జరిమానా విధిస్తారు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 153 పరుగులకే పరిమితం చేసిన టైటాన్స్ ఆ తర్వాత నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కాగా, గుజరాత్ టైటాన్స్ ఈ నెల 16న రాజస్థాన్ రాయల్స్‌తో అహ్మదాబాద్‌లో తలపడుతుంది.

Updated Date - 2023-04-14T16:59:28+05:30 IST