IPL 2023: సెంచరీతో చెలరేగిన బ్రూక్.. హైదరాబాద్ భారీ స్కోరు.. కోల్‌కతా ఏం చేస్తుందో!

ABN , First Publish Date - 2023-04-14T21:39:20+05:30 IST

విమర్శలు పటాపంచలయ్యాయి. రూ. 13.25 కోట్లు పెట్టి కొంటే చేసిది 13, 3, 13 పరుగులేనా?

IPL 2023: సెంచరీతో చెలరేగిన బ్రూక్.. హైదరాబాద్ భారీ స్కోరు.. కోల్‌కతా ఏం చేస్తుందో!

కోల్‌కతా: విమర్శలు పటాపంచలయ్యాయి. రూ. 13.25 కోట్లు పెట్టి కొంటే చేసిది 13, 3, 13 పరుగులేనా? అంటూ సన్‌రైజర్స్ ఓపెనర్ హారీ బ్రూక్‌(Harry Brook)పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలన్నింటినీ బ్రూక్ ఒకే ఒక్క సెంచరీతో మాయం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR)తో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో బ్రూక్ శివాలెత్తాడు. 55 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ బాది విమర్శలను స్టేడియం ఆవలకి నెట్టేశాడు. ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో ఇదే తొలి సెంచరీ. బ్రూక్ సెంచరీకి తోడు చివర్లో అభిషేక్ శర్మ కూడా విరుచుకుపడడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ హైదరాబాద్‌కి బ్యాటింగ్ అప్పగించాడు. అయితే,ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఆ తర్వాత బాధపడి ఉంటాడు. బ్రూక్-మయాంక్ అగర్వాల్ (9) కలిసి తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. బ్రూక్ జోరుగా ఆడితే మయాంక్ నెమ్మదిగా ఆడుతూ అతడికి చక్కని సహకారం అందించాడు. 9 పరుగులు మాత్రమే చేసిన మాయాంక్‌ను, అన్నే పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపిన కోల్‌కతా బౌలర్లు చేసుకున్న సంబరాలు ఎంతోసేపు నిలవలేదు.

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అయిడెన్ మార్కరమ్, అభిషేక్ శర్మ రూపంలో కోల్‌కతాకు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. మార్కరమ్ కూడా ఏమాత్రం తగ్గకుండా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. ఇక చివర్లో క్లాసెన్ కూడా చెలరేగాడు. 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 16 పరుగులు చేసి జట్టు స్కోరును 228 పరుగులకు చేర్చాడు.

హైదరాబాద్ బ్యాటర్ల బాదుడుకు కోల్‌కతా బౌలర్లు ప్రేక్షకులుగా మారిపోయారు. సుయాష్ శర్మ 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా లేకుండా 44 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఫెర్గ్యూసన్ అయితే రెండు ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే తీసుకుని 37 పరుగులు ఇచ్చుకున్నాడు.

Updated Date - 2023-04-14T21:46:02+05:30 IST