IPL 2023: రాహుల్ రాణించినా.. మిగతా వారు బ్యాట్లెత్తేశారు!

ABN , First Publish Date - 2023-04-15T21:45:07+05:30 IST

కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టుకు మరోమారు ఆపద్బాంధవుడయ్యాడు. బ్యాటర్లందరూ

IPL 2023: రాహుల్ రాణించినా.. మిగతా వారు బ్యాట్లెత్తేశారు!

లక్నో: కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టుకు మరోమారు ఆపద్బాంధవుడయ్యాడు. బ్యాటర్లందరూ ఒక్కొక్కరుగా క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగిన వేళ ఒంటరిపోరాటం చేసిన రాహుల్ జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో తనవంతు సాయం చేశాడు. పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)తో ఇక్కడి ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోకు శుభారంభమే లభించింది. రాహుల్, కైల్ మేయర్స్ కలిసి తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. మూడు సిక్సర్లు బాది మంచి జోరుమీదున్నట్టు కనిపించిన మేయర్స్‌ను హర్‌ప్రీత్ బ్రార్ వెనక్కి పంపాడు. 23 బంతులు ఆడిన మేయర్స్ ఫోర్, మూడు సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు.

ఆదుకుంటాడనుకున్న కృనాల్ పాండ్యా 18 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా, నికోలస్ పూరన్ గోల్డెన్ డక్ అయ్యాడు. స్టోయినిస్ 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ రాహుల్ మాత్రం పంజాబ్ బౌలర్లను ఎదురొడ్డాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 74 పరుగులు చేసి అర్షదీప్ సింగ్ బౌలింగులో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన వారు కూడా ఒకటి రెండు బంతులు ఆడి పెవిలియన్ చేరారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన లక్నో 159 పరుగులు చేసి పరువు నిలుపుకుంది. పంజాబ్ బౌలర్లలో శామ్ కరన్ 3 వికెట్లు తీసుకోగా, కగిసో రబడ 2 వికెట్లు పగొట్టాడు.

Updated Date - 2023-04-15T21:45:12+05:30 IST