KL Rahul: బౌండరీ ఆపుతూ గాయపడిన రాహుల్.. ఆటను ఆపేసిన వర్షం

ABN , First Publish Date - 2023-05-01T21:02:49+05:30 IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే లక్నో

KL Rahul: బౌండరీ ఆపుతూ గాయపడిన రాహుల్.. ఆటను ఆపేసిన వర్షం

లక్నో: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) గాయంతో మైదానాన్ని వీడాడు. మార్కస్ స్టోయినిస్ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ కవర్స్ మీదుగా బలంగా బాదాడు. బౌండరీకి తరలిపోతున్న బంతిని రాహుల్ పరుగున వెళ్లి ఆపే ప్రయత్నం చేశాడు. అయితే, మధ్యలోనే కుడి కాలినొప్పితో కుప్పకూలాడు. వెంటనే వచ్చేసిన ఫిజియోలు అతడిని మైదానం నుంచి చికిత్స కోసం తీసుకెళ్లారు. రాహుల్ బాధను పంటి బిగువున అణచిపెట్టుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు శుభారంభం లభించినప్పటికీ పరుగులు వేగంగా రాబట్టడంలో విఫలమైంది. కోహ్లీ-డుప్లెసిస్ కలిసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 30 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసిన కోహ్లీ.. రవి బిష్ణోయ్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత బెంగళూరు వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. అనూజ్ రావత్ (9), మ్యాక్స్‌వెల్ (4), సుయాష్ ప్రభుదేశాయ్ (6) దారుణంగా నిరాశ పరిచారు. కాగా, 15.2 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో ఆట నిలిచిపోయింది. అప్పటికి బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. డుప్లెసిస్ (40), దినేశ్ కార్తీక్ (1) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-05-01T21:02:49+05:30 IST