IPL 2023: డుప్లెసిస్, కోహ్లీ అర్ధ సెంచరీలు.. పంజాబ్ లక్ష్యం ఎంతంటే?
ABN , First Publish Date - 2023-04-20T17:29:04+05:30 IST
పంజాబ్ కింగ్స్(PBKS)తో జరుగుతున్న ఐపీఎల్(IPL 2023) మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్
మొహాలీ: పంజాబ్ కింగ్స్(PBKS)తో జరుగుతున్న ఐపీఎల్(IPL 2023) మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరుకు స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), ఫా డుప్లెసిస్(Faf Duplessis) శుభారంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించిన వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో 12 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఓవైపు డుప్లెసిస్, మరోవైపు కోహ్లీ పోటీలు పడి బ్యాటింగ్ చేశారు. తొలుత డుప్లెసిస్ అర్ధ సెంచరీ సాధించగా, ఆ తర్వాత కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకం పూర్తయ్యాక మరింతగా చెలరేగిన డ్లుప్లెసిస్ పంజాబ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఎడాపెడా బంతులను స్టాండ్స్‌కు తరలించాడు.
ఈ క్రమంలో 47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 59 పరుగులు చేసిన కోహ్లీని హర్‌ప్రీత్ బ్రార్ వెనక్కి పంపడంతో 137 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ గోల్డెన్ డక్ కావడంతో ఒకే స్కోరు వద్ద బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. జోరుగా ఆడుతూ సెంచరీ వైపుగా దూసుకెళ్తున్నట్టు కనిపించిన డుప్లెసిస్ 151 పరుగుల వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 56 బంతులు ఎదుర్కొన్న ఫా 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు.
14 పరుగుల స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ దూకుడుకు అడ్డుకట్ట పడింది. ఈ సీజన్‌లో తరచూ విఫలమవుతున్న దినేశ్ కార్తీక్(7) మరోమారు నిరాశపరిచాడు. భారీ స్కోరు తప్పదనుకున్న వేళ పంజాబ్ బౌలర్లు ఒత్తిడి పెంచడంతో చివర్లో పరుగులు రావడం కష్టమైంది. మొత్తంగా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగళూరు 174 పరుగులకు పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీసుకోగా, అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ చెరో వికెట్ తీసుకున్నారు.