IPL 2023: ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ గౌరవ ప్రదమైన స్కోరు
ABN , First Publish Date - 2023-04-09T21:50:23+05:30 IST
పంజాబ్(Punjab Kings) బ్యాటింగ్ చూసి 100 పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానాన్ని కెప్టెన్
హైదరాబాద్: పంజాబ్(Punjab Kings) బ్యాటింగ్ చూసి 100 పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానాన్ని కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) పటాపంచలు చేశాడు. 99 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉండి సెంచరీకి ఒక్క పరుగు ముందు నిలిచిపోయాడు. హైదరాబాద్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్‌కు ఆరంభం కలిసి రాలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఇక అది మొదలు వరుసపెట్టి వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టే వెనుదిరిగారు. ముఖ్యంగా మయాంక్ మర్కండే బంతులను ఎదుర్కోవడంలో తబడిన పంజాబ్ బ్యాటర్లు అతడికొక్కడికే నాలుగు వికెట్లు సమర్పించుకున్నారు.
సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా ఏమాత్రం ఏకాగ్రత కోల్పోయిన కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. మొత్తంగా 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 93 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్‌గా మలిచిన ధావన్ 99 పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు ముందు నిలిచిపోయాడు.
ధావన్ తర్వాత శామ్ కరన్ చేసిన 22 పరుగులే జట్టులో రెండో అత్యధికం. మిగతా 9 మందికి కలిపి 16 పరుగులు మాత్రమే చేయగలిగారు. మొత్తానికి ధావన్ పుణ్యమా అని పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.