IPL 2023: గంగూలీ మళ్లీ వచ్చేస్తున్నాడు!

ABN , First Publish Date - 2023-01-03T16:39:33+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) మళ్లీ

IPL 2023: గంగూలీ మళ్లీ వచ్చేస్తున్నాడు!
Ganguly

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) మళ్లీ వచ్చేస్తున్నాడు. ఈసారి ఐపీఎల్‌లో కనిపించబోతున్నాడు. ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) హెడ్‌గా వెళ్లబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా తప్పుకున్న తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌తో గంగూలీ తొలి అసైన్‌మెంట్ ఇదే. 2019 సీజన్‌లో గంగూలీ ఢిల్లీ కేపిటల్స్ అడ్వైజర్‌గా పనిచేశాడు. అదే ఏడాది అక్టోబరులో బీసీసీఐ అధ్యక్షుడయ్యాక డీసీ అడ్వైజర్ పదవికి గంగూలీ రాజీనామా చేశారు.

గతేడాది అక్టోబరులో రోజర్ బిన్నీ(Roger Binny) బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడంతో బోర్డులో గంగూలీ శకం ముగిసింది. కపిల్‌దేవ్ (Kapil Dev) సారథ్యంలోని భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడు. ఢిల్లీ కేపిటల్స్ మేనేజ్‌మెంట్, ఆటగాళ్లతో గంగూలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. 2019 ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించిన తర్వాత రిషభ్ పంత్‌(Rishabh Pant)ను గంగూలీ ఎత్తుకున్న వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

బీసీసీఐ(BCCI) ప్రెసిడెంట్‌గా పదవీ కాలం ముగిసిన తర్వాత గంగూలీ మాట్లాడుతూ.. ఏదీ శాశ్వతం కాదని, జీవితంలో మరిన్ని పెద్ద విషయాలపై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చాడు. దేశం కోసం ఆడినవే అత్యుత్తమ రోజులని తాను చెబుతూ ఉంటానని, ఆ తర్వాత కూడా తాను ఎక్కువే చూశానని పేర్కొన్నాడు. తాను ‘క్యాబ్’ అధ్యక్షుడిగా, బీసీసీఐ చీఫ్‌గా పనిచేశానని, భవిష్యత్తులో మరిన్ని పెద్ద పదవులు నిర్వర్తిస్తానని అప్పట్లో చెప్పుకొచ్చాడు. అయితే, దేశం కోసం ఆడిన ఆ 15 సంవత్సరాలు తన జీవితంలో ఉత్తమమైన రోజులని వివరించాడు.

బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి ముందు గంగూలీకి ఐపీఎల్(IPL) చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ అతడు అంగీకరించలేదు. బీసీసీఐకి బాస్‌గా పనిచేశాక, దాని సబ్ కమిటీకి పనిచేయలేనని గంగూలీ తెగేసి చెప్పేశాడు.

Updated Date - 2023-01-03T16:39:34+05:30 IST