IPL 2023: పూనకం వచ్చినట్టు ఊగిపోయిన లక్నో బ్యాటర్లు.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు!
ABN , First Publish Date - 2023-04-28T21:41:13+05:30 IST
పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) తప్పు చేశాడు. టాస్ గెలిచి లక్నోకు బ్యాటింగ్ అప్పగించి
మొహాలీ: పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) తప్పు చేశాడు. టాస్ గెలిచి లక్నోకు బ్యాటింగ్ అప్పగించి ఎంత తప్పు చేసిందీ తీరిగ్గా బాధపడి ఉంటాడు. దానిని బ్యాటింగ్ అంటారా? బంతులను ఊచకోత కోస్తూ లక్నో (LSG) బ్యాటర్లు మైదానంలో విధ్వంసం సృష్టించారు. వచ్చినవారు వచ్చినట్టే బంతులను స్టాండ్స్‌లోకి పంపిస్తూ పరుగుల సునామీ సృష్టించారు. తొలుత కైల్ మేయర్స్, ఆ తర్వాత ఆయుష్ బదోనీ, అనంతరం మార్కస్ స్టోయినిస్.. ఒకరనేమిటి లక్నో బ్యాటర్లు శివాలెత్తిపోయారు.
వారి దెబ్బకు పంజాబ్ (PBKS) ఆటగాళ్లు ప్రేక్షకులుగా మారిపోయారు. బౌండరీలు దాటిన బంతులను అందించేందుకు మాత్రమే ఫీల్డర్లు పరిమితమయ్యారు. ఇక, బౌలర్లు తప్పదన్నట్టు బంతులు వేశారు. బంతి వేస్తే ఏమవుతుందోనన్న భయం బౌలర్లలో కనిపిస్తే, బంతిని క్యాచ్ అందుకుందామని ప్రేక్షకులు చేతులు పైకెత్తి పెట్టుకున్నారు. బ్యాటర్ల బాదుడుకు లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.
మేయర్స్ 24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు, బదోనీ 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43, మార్కస్ స్టోయినిస్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 72, నికోలస్ పూరన్ 19 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 45 పరుగులు, దీపక్ హుడా 6 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేశారు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు నమోదైంది. అంతకుముందు 2013లో పూణె వారియర్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.