Amith Mishra: పొరపాటున బంతికి ఉమ్మి రాసిన అమిత్ మిశ్రా.. అదే ఓవర్‌లో విరాట్ కోహ్లీ ఔట్.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2023-04-11T18:17:13+05:30 IST
కరోనా(Corona Virus) మహమ్మారి విజృంభణ తర్వాత క్రికెట్‌లో కొత్త రూల్స్ చాలానే
బెంగళూరు: కరోనా(Corona Virus) మహమ్మారి విజృంభణ తర్వాత క్రికెట్‌లో కొత్త రూల్స్ చాలానే వచ్చాయి. అయితే, కరోనా క్రమంగా కనుమరుగు కావడంతో ఆ తర్వాత కొన్ని నిబంధనలు మాయమయ్యాయి. అయితే, ఒక్కటి మాత్రం ఇంకా కొనసాగుతోంది. అది బంతికి ఉమ్మి(Saliva) రాయకుండా నిషేధం.
సాధారణంగా బంతి బాగా తిరిగేందుకు ఉమ్మి రాయడం పరిపాటి. అయితే, కరోనా సమయంలో మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు బంతిపై ఉమ్మి రాయడాన్ని నిషేధించారు. దీంతో క్రికెటర్లు ఇప్పుడు తమ చెమటను బంతికి రాస్తూ బంతిని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కాలంగా నిషేధం అమల్లో ఉండడంతో బంతికి ఉమ్మి రాయడాన్ని దాదాపు అందరూ మర్చిపోయారు.
అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) బౌలర్ అమిత్ మిశ్రా(Amit Mishra) అలవాటులో పొరపాటులా బంతికి ఉమ్మి రాసేశాడు. 12వ ఓవర్ బౌల్ చేసిన మిశ్రా బంతికి ఉమ్మి రాస్తూ కెమెరాకు దొరికిపోయాడు. అయితే, విషయాన్ని గమనించడంలో ఫీల్డ్ అంపైర్లు విఫలమయ్యారు. ఆశ్చర్యకరంగా అదే ఓవర్ మూడో బంతికి కోహ్లీ అవుటయ్యాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి విజయం సాధించి 6 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.