Share News

India vs Australia: ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని పరిణామం.. మైదానంలోకి అజ్ఞాత వ్యక్తి.. ఏం చేశాడో తెలుసా?

ABN , First Publish Date - 2023-11-19T15:48:50+05:30 IST

ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో భారత్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది.

India vs Australia: ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని పరిణామం.. మైదానంలోకి అజ్ఞాత వ్యక్తి.. ఏం చేశాడో తెలుసా?

ODI World Cup 2023 Final: ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో భారత్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే.. భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి.. మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి, అతడ్ని హగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు.


ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకోవడం సర్వసాధారణమే. కానీ.. ఇక్కడ జరిగిన పరిణామంలో ఆ వ్యక్తి పాలస్తీనాకు మద్దతుగా దుస్తులు ధరించడం హైలైట్‌గా నిలిచింది. అతడు ధరించిన తెలుపు రంగు టీ-షర్ట్ ముందు భాగంలో ‘పాలస్తీనాపై బాంబింగ్ ఆపండి’ అని రాసి ఉండగా.. వెనుక భాగంలో ‘ఫ్రీ పాలస్తీనా’ అనే సందేశం ఉంది. అంతేకాదు.. అతని చేతిలో పాలస్తీనా జాతీయ జెండా ఉంది. అలాగే.. పాలస్తీనా జాతీయ జెండాతో డిజైన్ చేసిన మాస్క్‌ని సైతం ధరించాడు. అతడు ఒక్కసారిగా దూసుకురావడం చూసి, కోహ్లీ మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాడు. వెంటనే సిబ్బంది అతని వద్దకు చేరుకొని, తిరిగి వెనక్కు తీసుకెళ్లిపోయింది.

ఇదిలావుండగా.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత హమాస్ మెరుపుదాడులు చేయగా.. అందుకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో గాజాలోని సామాన్య పౌరులు.. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు అన్యాయంగా చనిపోతున్నారు. అందుకు సంఘీభావం తెలుపుతూ.. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న దాడుల్ని ఆపాల్సిందిగా ఈ అజ్ఞాత వ్యక్తి మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-11-19T15:48:51+05:30 IST