Virat Kohli-Sourav Ganguly: కోహ్లీ కడుపులో తప్పకుండా మంట ఉండే ఉంటుంది: షేన్ వాట్సన్

ABN , First Publish Date - 2023-04-20T21:30:49+05:30 IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)-ఢిల్లీ కేపిటల్స్(DC) మధ్య ఈ నెల 15న జరిగిన మ్యాచ్

Virat Kohli-Sourav Ganguly: కోహ్లీ కడుపులో తప్పకుండా మంట ఉండే ఉంటుంది:  షేన్ వాట్సన్

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)-ఢిల్లీ కేపిటల్స్(DC) మధ్య ఈ నెల 15న జరిగిన మ్యాచ్ కోహ్లీ(Virat Kohli)-గంగూలీ(Sourav Ganguly) మధ్య ఉన్న విభేదాలను ప్రపంచానికి చాటింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది.

మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో కోహ్లీ-గంగూలీ తారసపడ్డారు. ఢిల్లీ కోచ్ రికీపాంటింగ్‌తో చేయి కలిపిన కోహ్లీ.. గంగూలీతో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. గంగూలీ కూడా కోహ్లీని పట్టించుకోకుండా ముందుకెళ్లాడు. ఆ తర్వాత కోహ్లీ-గంగూలీ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్టు కూడా వార్తలొచ్చాయి.

ఈ ఘటనపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, ఢిల్లీ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్(Shane Watson) స్పందించాడు. ‘ది గ్రేడ్ క్రికెటర్’ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో కోహ్లీ-గంగూలీ వివాదంపై అడిగిన ప్రశ్నకు వివరాల్లోకి వెళ్లేందుకు వాట్సన్ కొంత సంశయిస్తూనే.. ‘కోహ్లీ కడుపులో మంట ఉందని’ అన్నాడు. అయితే, వారిద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయంలో మాత్రం తనకు స్పష్టత లేదన్నాడు.

వారిద్దరి సంబంధాలపై పుకార్లు అయితే ఉన్నాయని, అయితే సరిగ్గా ఏం జరిగిందన్నది తెలియకుండా అందులో జోక్యం చేసుకోవడం తగదన్నాడు. కోహ్లీ కడుపులో తప్పకుండా మంట ఉండే ఉంటుందని చెప్పుకొచ్చాడు. అది మాత్రం పక్కా అని పేర్కొన్నాడు. కారణమేదైనా ఆ విషయంలో తనకు పూర్తి స్పష్టత లేదని వాట్సన్ తేల్చి చెప్పాడు. కాగా, గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలో కోహ్లీ కెప్టెన్సీ కోల్పోయాడు. వారి మధ్య విభేదాలకు ఇదే కారమని చెబుతారు.

Updated Date - 2023-04-20T21:30:49+05:30 IST