Tilak Varma: తెలుగోడు ‘తిలక్’ చరిత్ర సృష్టించాడు

ABN , First Publish Date - 2023-08-06T21:54:43+05:30 IST

భారత యువ క్రికెటర్, తెలుగుతేజం తిలక్ వర్మ తాజాగా ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత పిన్న వయసులోనే అర్థశతకం నమోదు చేసిన భారత ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీతో అతడు ఈ ఘనతని తన పేరిట లిఖించుకున్నాడు.

Tilak Varma: తెలుగోడు ‘తిలక్’ చరిత్ర సృష్టించాడు

భారత యువ క్రికెటర్, తెలుగుతేజం తిలక్ వర్మ తాజాగా ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత పిన్న వయసులోనే అర్థశతకం నమోదు చేసిన భారత ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీతో అతడు ఈ ఘనతని తన పేరిట లిఖించుకున్నాడు. 20 సంవత్సరాల 271 రోజుల వయసు ఉన్నప్పుడు తిలక్ వర్మ ఈ రికార్డ్ సాధించాడు. అగ్రస్థానంలో మాత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతను 20 ఏళ్ల 143 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక రిషభ్ పంత్ (21 ఏళ్ల 38 రోజులు), రాబిన్ ఉతప్ప (21 ఏళ్ల 307 రోజులు), సురేశ్ రైనా (22 ఏళ్ల 90 రోజులు) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు.


ఇక వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. తిలక్ వర్మ (51) అర్థశతకంతో రాణించగా.. ఇషాన్ కిషన్ (27), హార్దిక్ పాండ్యా (24) కాస్త పర్వాలేదనిపించారు. భారీ అంచనాలు పెట్టుకున్న శుభ్మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (1), సంజూ శాంసన్ (7) మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. గిల్, సంజూ క్యాచ్ ఔట్ అవ్వగా.. సూర్య అనవసరమైన రన్‌కి వెళ్లి, రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. వీళ్లందరూ చేతులు ఎత్తేయడం వల్ల.. భారత జట్టు 152 పరుగులకే పరిమితమై, వెస్టిండీస్‌కి 153 పరుగులు నిర్దేశించింది. మరి, బౌలర్లు ఈ స్కోరుని డిఫెండ్ చేయగలరా? వెస్టిండీస్ బ్యాటర్లను కట్టడి చేసి, టీమిండియాని గెలిపించగలరా?

Updated Date - 2023-08-06T21:56:55+05:30 IST