Umesh Yadav: సింగిల్ తీసిన ఉమేశ్ యాదవ్‌పై కేకేఆర్ ప్రశంసల వర్షం
ABN , First Publish Date - 2023-04-10T18:53:06+05:30 IST
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టుకు
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించిన రింకూసింగ్ (Rinku Singh)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చివరి ఓవర్ తొలి బంతిని ఎదుర్కొన్న ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) సింగిల్ తీసి రింకూకు అవకాశం ఇచ్చాడు. రింకు ప్రతిభపై అపార విశ్వాసమున్న ఉమేశ్ యాదవ్ సింగిల్ తీయడం ద్వారా జట్టు గెలుపు బాధ్యతను అతడి భుజాలపై వేశాడు. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న రింకు సింగ్ జట్టుకు అపురూప విజయాన్ని అందించిపెట్టాడు.
నిజానికి ఉమేశ్ యాదవ్ జాగ్రత్తగా సింగిల్ తీయకున్నా, ఒక వేళ ఫోర్ కొట్టినా, లేదంటే రెండు పరుగులు చేసినా కోల్‌కతా ఓటమి ఖాయమయ్యేదే. అయితే, ఉమేశ్ తెలివిగా వ్యవహరించి సింగిల్ తీయడం ద్వారా ముందుగానే జట్టు విజయావకాశాలను అంచనా వేశాడు.
జట్టుకు విజయాన్ని అందించి పెట్టిన రింకు సింగ్‌పై ఎల్లెడలా ప్రశంసలు కురుస్తున్న వేళ కోల్‌కతా కోచ్ చంద్రకాంత్ పండిట్.. ఉమేశ్ యాదవ్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. కీలక సమయంలో ఉమేశ్ సింగిల్ తీయడం ద్వారా రింకు చెలరేగిపోవడానికి అవకాశం కల్పించాడంటూ ప్రశ్నంసల వర్షం కురిపించాడు.
మ్యాచ్ అనంతరం జట్టు సభ్యులతో మాట్లాడిన పండిట్.. తాను ఇప్పటి వరకు చూసిన ఇన్నింగ్స్‌లలో ఇదే అత్యుత్తమమైనదని అన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా, అంతర్జాతీయ ఆటగాడిగా తన 43 సంవత్సరాల క్రికెట్ కెరియర్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌ను ఇప్పటి వరకు చూడలేదన్నాడు. తాను గతంలో రెండు ఇన్నింగ్స్‌లు చూశానని, అందులో ఒకటి రంజీల్లో రవిశాస్త్రి ఆరు సిక్సర్లు కాగా, దుబాయ్‌లో జావెద్ మియాందాద్ కొట్టిన చివరి బంతి సిక్సర్ అని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత చూసింది నిన్నేనని రింకును ఉద్దేశించి పేర్కొన్నాడు. దీంతో సహచరులందరూ కరతాళ ధ్వనులతో రింకూని అభినందించారు.
ఆ తర్వాత ఉమేశ్ యాదవ్‌ను పండిట్ ప్రశంసించాడు. చివరి ఓవర్ తొలి బంతికి ఉమేశ్ యాదవ్ సింగిల్ తీయగానే కెమెరాలన్నీ అతడి వైపు తిరిగాయని, విజయం సాధించినట్టుగా బౌలర్ సంబరాలు చేసుకున్నాడని పండిట్ గుర్తు చేశాడు. అయితే, ఉమేశ్ యాదవ్, కెప్టెన్ నితీశ్ రాణా ఇద్దరికీ రింకుపై నమ్మకం ఉందని, ఇద్దరూ అతడిని ప్రోత్సహించారని అన్నాడు. ‘‘నమ్మకం ఉంచుకో. చివరి వరకు క్రీజులో ఉండు’’ అని రాణా భాయ్ తనతో చెప్పాడని రింకు పేర్కొన్నాడు. ఉమేశ్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు గుర్తుచేసుకున్నాడు. ‘ఆలోచించొద్దు.. కొట్టు’ అని చెప్పాడని పేర్కొన్నాడు.