Share News

Marlon Samuels: విండీస్ వీరుడికి షాకిచ్చిన ఐసీసీ.. ఆరేళ్లపాటు నిషేధం.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-11-23T16:24:08+05:30 IST

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది. అన్ని ఫార్మాట్ల నుంచి అతడ్ని ఆరేళ్ల పాటు నిషేధిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యాంటీ కరప్షన్ కోడ్‌ను...

Marlon Samuels: విండీస్ వీరుడికి షాకిచ్చిన ఐసీసీ.. ఆరేళ్లపాటు నిషేధం.. ఎందుకంటే?

ICC Banned Marlon Samuels: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది. అన్ని ఫార్మాట్ల నుంచి అతడ్ని ఆరేళ్ల పాటు నిషేధిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించిన వ్యవహారంలో శామ్యూల్స్ దోషిగా తేలడంతో.. అతనిపై ఐసీసీ నిషేధం విధించింది.

2019 టీ20 లీగ్ సమయంలో శామ్యూల్స్ ఈసీబీ అవినీతి నిరోధక కోడ్‌ని ఉల్లంఘించాడని ఆరోపణలు చేస్తూ.. 2021 సెప్టెంబర్‌లో ఐసీసీ అతనిపై నాలుగు అభియోగాలు మోపింది. వీటిపై విచారణ చేపట్టిన ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులు.. 2023 ఆగస్టులో శామ్యూల్స్‌ను దోషిగా తేల్చారు. ఈ క్రమంలోనే గురువారం అన్ని రకాల క్రికెట్ వ్యవహారాల నుంచి శామ్యూల్స్‌ను ఐసీసీ ఆరు సంవత్సరాల పాటు నిషేధించింది. ఈ నిషేధం నవంబర్ 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.


ఈ విషయంపై ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ మాట్లాడుతూ.. శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడని, ఆ సమయంలో అతడు అనేకసార్లు అవినీతి వ్యతిరేక సెషన్లలో పాల్గొన్నాడని అన్నారు. ఇప్పుడతను క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ, తాను క్రికెట్ ఆడుతున్న సమయంలోనే నేరాలకు పాల్పడ్డాడని వివరించారు. అతనిపై విధించిన ఈ ఆరేళ్ల నిషేధం.. నిబంధనలను అతిక్రమించే ఉద్దేశం ఉన్నవారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. వెస్టిండీస్ తరఫున శామ్యూల్స్ 300లకు పైగా మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో వెస్టిండీస్‌కి నాయకత్వం కూడా వహించాడు. 2012, 2016 సంవత్సరాల్లో వెస్టిండీస్ టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచినప్పుడు.. ఆ ఫైనల్ మ్యాచ్‌ల్లో శామ్యూల్సే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ తరఫున 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20 మ్యాచ్‌లు ఆడిన శామ్యూల్స్‌.. 11134 పరుగులు చేశాడు. 2020 నవంబరులో అతడు ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు.

Updated Date - 2023-11-23T16:24:09+05:30 IST