IND vs PAK: పాక్ ఆశలపై నీళ్లు.. టీమిండియాను ఆదుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా

ABN , First Publish Date - 2023-09-02T19:25:27+05:30 IST

66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను మిడిలార్డర్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. నిప్పులు కక్కే బంతులతో చెలరేగుతున్న పాక్ బౌలర్లపై ఆరంభం నుంచి ఎదురు దాడి చేసిన వీరిద్దరు టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు.

IND vs PAK: పాక్ ఆశలపై నీళ్లు.. టీమిండియాను ఆదుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా

కాండీ: 66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను మిడిలార్డర్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. నిప్పులు కక్కే బంతులతో చెలరేగుతున్న పాక్ బౌలర్లపై ఆరంభం నుంచి ఎదురు దాడి చేసిన వీరిద్దరు టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు. హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఐదో వికెట్‌కు ఏకంగా 138 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో టీమిండియా స్కోర్‌ను వీరిద్దరే 200 దాటించారు. దీంతో టీమిండియా టాపార్డర్‌ను వెంట వెంటనే ఔట్ చేసిన ఆనందం పాకిస్థాన్‌కు ఎంతో సేపు నిలవలేదు. అంతేకాకుండా టీమిండియాను తక్కువ స్కోర్‌కే కట్టడి చేస్తామని ఆశించిన పాక్ ఆశలపై ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా నీళ్లు చల్లారనే చెప్పుకోవాలి.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. పాక్ పేసర్లు షాహీన్ ఆఫ్రిది, హరీస్ రవూఫ్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(4) దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరిని ఆఫ్రిదీనే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్(10), శ్రేయస్ అయ్యర్(14) కూడా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. వీరిని హరిస్ రవూఫ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 66 పరుగులకే టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో టీమిండియాను వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. అద్భుతంగా ఆడిన వీరిద్దరు ఐదో వికెట్‌కు 138 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ తన వన్డే కెరీర్‌లో ఏడో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా.. హార్దిక్ పాండ్యా 11వ హాఫ్ సెంచరీని చేశాడు. అనంతరం వీరిద్దరు మరింత దూకుడుగా ఆడారు. దీంతో జట్టు స్కోర్ 200 దాటింది.

చూస్తుంటే ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టేవాడిలానే కనిపించాడు. కానీ హరీస్ రౌఫ్ వేసిన 38వ ఓవర్ మూడో బంతికి బాబర్ అజామ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 204 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన కిషన్ 9 ఫోర్లు, 2 సిక్సులతో 81 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. కిషన్ ఔటైనప్పటికీ జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన హార్దిక్ కూడా సెంచరీ దిశగా పయనించాడు. కానీ ఆఫ్రీది వేసిన 44వ ఓవర్ మొదటి బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించి ఆఘా సల్మాన్ కు క్యాచ్‌గా దొరికిపోయాడు. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 90 బంతుల్లో 87 పరుగులు చేశాడు. దీంతో 239 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది.

Updated Date - 2023-09-02T19:29:03+05:30 IST