IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

ABN , First Publish Date - 2023-09-24T22:47:12+05:30 IST

ఇండోర్‌లోని హోల్కార్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. డీఎల్ఎస్ పద్ధతిలో 99 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. దీంతో..

IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

ఇండోర్‌లోని హోల్కార్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. డీఎల్ఎస్ పద్ధతిలో 99 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. దీంతో.. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతోనూ.. సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్), కేఎల్ రాహుల్ (52) అర్థశతకాలతో అద్భుతంగా రాణించడంతో భారత్ అంత భారీ స్కోరు చేయగలిగింది.


ఇక 400 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగగా.. 9 ఓవర్ల ఆట పూర్తయ్యాక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో.. డీఎల్ఎస్ పద్ధతిలో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదిరించి, ఆసీస్ ముందు 317 లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే.. ఈ లక్ష్య ఛేధనలో భాగంగా డేవిడ్ వార్నర్ (53), సీన్ అబాట్ (54) మినహాయించి మిగతా ప్లేయర్లందరూ ఘోరంగా విఫలం అవ్వడంతో.. ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిజానికి.. భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోవడంతో, 150 లోపే తట్టాబుట్టా సర్దేస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. సీన్ అబాట్ చివర్లో మెరుపులు మెరిపించి తన జట్టు స్కోరుని 200 పరుగుల మైలురాయిని దాటించాడు.

భారత బౌలర్ల విషయానికొస్తే.. జడేజా 3, అశ్విన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2, షమి ఒకటి చొప్పున వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బౌలింగ్ వేసిన ఆస్ట్రేలియా బౌలర్ల గురించి మాట్లాడితే.. కెమెరాన్ గ్రీన్ 2 వికెట్లైతే తీశాడు కానీ, పరుగులు మాత్రం భారీగా సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో ఏకంగా 103 పరుగులు ఇచ్చాడు. సీన్ అబాట్ సైతం ఒక వికెట్ తీసి, 91 పరుగులు ఇచ్చేశాడు. హాజిల్‌వుడ్, జంపా చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.

Updated Date - 2023-09-24T22:49:01+05:30 IST