IPL: ఫైనల్‌కు చేరేది ఎవరో?
ABN , First Publish Date - 2023-05-23T09:20:58+05:30 IST
స్థానిక చెపాక్ క్రికెట్ మైదానంలో మంగళవారం క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్(Gujarat Titans, Chennai Super Kings) తలపడనున్నాయి.
- నేడు చెపాక్‌లో ఐపీఎల్ సందడి
- గుజరాత్-సీఎస్కే మధ్య క్వాలిఫయర్ మ్యాచ్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక చెపాక్ క్రికెట్ మైదానంలో మంగళవారం క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్(Gujarat Titans, Chennai Super Kings) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకోనుండగా, ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో గెలిచే జట్టుతో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ సొంత స్టేడియంలో ఆడుతుండడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండాపోతోంది. క్వాలిఫయర్ ఆడుతున్న తమ జట్టుకు మద్దతు ఇవ్వడంతో పాటు ఆఖరి మ్యాచ్ ఆడుతున్నట్లుగా భావిస్తున్న జట్టు కెప్టెన్ ధోనీకి అండగా నిలిచేందుకు, తమ అభిమానాన్ని చాటేందుకు క్రికెట్ అభిమానులు భారీగా తరలిరాన్నారు. దీంతో ఈ మ్యాచ్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. సాధారణంగా ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించే సమయంలో లీగ్, క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్ తేదీలను కూడా వెల్లడిస్తుంటారు. అయితే ఈసారి లీగ్ మ్యాచ్(League match)లు మాత్రమే ప్రకటించగా, ఇటీవలే క్వాలిఫయర్ మ్యాచ్‌ల తేదీలను వెల్లడించారు. అందులో క్వాలిఫయర్-1, 3 మ్యాచ్‌లకు చేపాక్కం ఆతిథ్యమివ్వనుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతనికి సొంత గడ్డపై ఘనంగా వీడ్కోలు పలికేలా రెండు మ్యాచ్‌లు చెన్నైలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సొంత మైదానం కావడం, అసంఖ్యాక అభిమానుల మధ్య ఆడడం, ఈ మైదానంలో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ ఆడకపోవడం చెన్నై సూపర్ కింగ్స్‌కు సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. అంతేగాక ఇప్పటి వరకూ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. దాంతో ఆ జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. అయితే ఈ సారి సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాలని ధోనీ సేన భావిస్తోంది. దీంతో మంగళవారం జరిగే మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే చెన్నై చేరుకున్న జట్లు సోమవారం సాయంత్రం స్టేడియంలో ప్రాక్టీస్ చేశాయి.