Share News

India vs South Africa: తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమిపై స్పందించిన సచిన్ టెండూల్కర్

ABN , Publish Date - Dec 29 , 2023 | 02:12 PM

మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓటమిపాలడంపై క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

India vs South Africa: తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమిపై స్పందించిన సచిన్ టెండూల్కర్

సెంచూరియన్ టెస్టులో ఓటమితో 2023 ఏడాదిని టీమిండియా పరాభవంతో ముగించాల్సి వస్తోంది. ఏకంగా ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉండడంతో ఈసారి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సిరీస్ గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. భారత్ తొలి ఇన్నింగ్స్ 245 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 131 పరుగులకే జట్టు ఆలౌట్ అయ్యింది. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగుల భారీ స్కోరు సాధించింది. 185 పరుగులు సాధించిన బ్యాటర్ డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లి (76) మాత్రమే ఫరవాలేదనిపించాడు. మొత్తంగా భారత్ ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే టీమిండియా ఓటమి రకరకాల విశ్లేషణలు వెలువడుతున్న వేళ క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పాడు.


‘‘దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. మొదటి ఇన్నింగ్స్ తర్వాత దక్షిణాఫ్రికా ఇబ్బందుల్లో పడుతుందేమోనని అనుకున్నాను. కానీ దక్షిణాఫ్రికా పేసర్లు అద్బుతం చేశారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినప్పటికీ అంచనాలను మించి రెండో ఇన్నింగ్స్‌లో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మ్యాచ్‌లో పట్టు సాధించారు. భారత ఆటగాళ్ల షాట్ ఎంపిక పేలవంగా ఉంది. ఆశించిన స్థాయిలో లేదు. టెస్ట్ మొత్తంలో ఎల్గర్, జాన్సెన్, బెడింగ్‌హామ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కొద్దిమంది బ్యాట్స్‌మెన్ మాత్రమే రాణించారు. సంయమనంతో ఆడారు’’ అని వ్యాఖ్యానించాడు.

కాగా కేప్‌టౌన్ వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 1-1 తో సిరీస్ సమం అవుతుంది. ఒక వేళ డ్రా అయినా 1-0 తేడాతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను ఎగరేసుకుపోతుంది.

Updated Date - Dec 29 , 2023 | 02:13 PM