Sourav Ganguly Birthday Special: 23 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు.. గంగూలీ 16 ఏళ్ల కెరీర్లో టాప్ 3 ఇన్నింగ్స్‌లు ఇవే!
ABN , First Publish Date - 2023-07-08T17:24:35+05:30 IST
టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) శనివారంతో 52వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో అభిమానులు, సన్నిహితులు గంగూలీ పుట్టిన రోజు వేడులకను ఘనంగా నిర్వహిస్తున్నారు. తన 16 ఏళ్ల కెరీర్లో టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో చెరగని ముద్ర వేసిన గంగూలీ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. టీమిండియా కష్ట కాలంలో ఉన్న సమయంలో కెప్టెన్సీ చేపట్టి జట్టు గతినే మార్చేశాడు.
టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) శనివారంతో 52వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో అభిమానులు, సన్నిహితులు గంగూలీ పుట్టిన రోజు వేడులకను ఘనంగా నిర్వహిస్తున్నారు. తన 16 ఏళ్ల కెరీర్లో టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో చెరగని ముద్ర వేసిన గంగూలీ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. టీమిండియా కష్ట కాలంలో ఉన్న సమయంలో కెప్టెన్సీ చేపట్టి జట్టు గతినే మార్చేశాడు. కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపించడంతోపాటు టీమిండియాకు అనేక విజయాలు అందించాడు. గంగూలీ కెప్టెన్సీలోనే టీమిండియాలో ఎన్నో మంచి మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే గంగూలీకి దాదా, బెంగాల్ టైగర్ అనే పేర్లు కూడా పెట్టారు. బీసీసీఐ అధ్యక్షుడిగా (BCCI President) కూడా భారత జట్టుకు సేవలందించారు. అయితే శనివారం గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా దాదా కెరీర్లోని టాప్ 3 ఇన్నింగ్స్‌లను ఒకసారి నెమరువేసుకుందాం.
1999 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 183 పరుగులు
గంగూలీ కెరీర్లో గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఎన్ని ఉన్నప్పటికీ 1999 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకపై చేసిన 183 పరుగులు టాప్‌లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ప్రపంచకప్ లీగ్ స్టేజ్‌లో భారత జట్టు అప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వరుసగా సౌతాఫ్రికా, జింబాబ్వే చేతిలో టీమిండియాకు పరాభవం ఎదురైంది. దీంతో రాబోయే మ్యాచ్‌లు టీమిండియాకు డూఆర్‌డైగా మారాయి. టీమిండియా నాకౌట్ చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇలాంటి సమయంలో శ్రీలంకపై గంగూలీ విశ్వరూపం చూపించాడు. 17 ఫోర్లు, 7 సిక్సులతో 158 బంతుల్లోనే 183 పరుగులతో పెను విధ్వంసం సృష్టించాడు. ఇప్పటికీ వన్డే ప్రపంచకప్‌ల చరిత్రలో టీమిండియా ఆటగాళ్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే. 23 ఏళ్లయినా గంగూలీ రికార్డు చెక్కు చెదరలేదు. గంగూలీ విధ్వంసానికి తోడు ద్రావిడ్ కూడా సెంచరీతో చెలరేగడంతో ఆ మ్యాచ్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
2003లో గబ్బాలో ఆస్ట్రేలియాపై 144 పరుగులు
గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు 2003లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడింది. గబ్బా వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో గంగూలీ కీలక సెంచరీతో దుమ్ములేపాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 323 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 62 పరుగులకే టాప్ 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ద్రావిడ్, సచిన్ ఒక్క పరుగు వ్యవధిలో ఔటయ్యారు. ఇలాంటి సమయంలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే ఒత్తిడిని తట్టుకుంటూ అద్భుతంగా ఆడిన గంగూలీ సెంచరీతో చెలరేగాడు. అతనికి లక్ష్మణ్ కూడా సహకరించడంతో జట్టును అధిక్యంలోకి తీసుకెళ్లాడు. 18 ఫోర్లతో 196 బంతుల్లోనే 144 పరుగులు బాదేశాడు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 409 పరుగులు చేసి 86 పరుగుల అధిక్యంలో నిలిచింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ రెండు జట్లు సత్తా చాటడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. కానీ అద్భుత కెప్టెన్సీతోపాటు సెంచరీతో చెలరేగిన గంగూలీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
అరంగేట్రంలోనే సెంచరీ
సౌరవ్ గంగూలీ 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన మొదటి మ్యాచ్‌లోనే కఠినమైన ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొవలసి వచ్చింది. క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన దాదా సెంచరీతో విరుచుకుపడ్డాడు. తద్వారా క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో అరంగేట్ర మ్యాచ్ ఆడడమే గొప్ప అనుకుంటే సెంచరీ కొట్టి ఆ మ్యాచ్‌ను మరింత మరుపురానిదిగా మలుచుకున్నాడు. కాగా ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక గంగూలీ కెరీర్లో ఈ 3 ఇన్నింగ్స్‌లే కాకుండా అనేక గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లున్నాయి. తన నైపుణ్యంతో భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు.