స్పిన్ ఉచ్చులో చెన్నై విలవిల
ABN , First Publish Date - 2023-04-28T04:36:21+05:30 IST
చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ విజయాల జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది.
రాణించిన జంపా, అశ్విన్
32 రన్స్‌తో రాజస్థాన్ విజయం
జైస్వాల్ అర్ధ శతకం
జైపూర్: చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ విజయాల జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77) కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. స్పిన్నర్లు జంపా (3/22), అశ్విన్ (2/35) సీఎ్‌సకే బ్యాటర్లను కుదురుకోనీయలేదు. దీంతో శాంసన్ సేన 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్‌లో రెండుసార్లు చెన్నైపై రాజస్థాన్ నెగ్గడం విశేషం. మరోవైపు 10 పాయింట్లతో రాయల్స్ టాప్‌నకు చేరింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34), పడిక్కళ్ (13 బంతుల్లో 5 ఫోర్లతో 27 నాటౌట్) వేగంగా ఆడారు. దేశ్‌పాండేకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసి ఓడింది. శివమ్ దూబే (33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52), రుతురాజ్ (29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 47) ఆకట్టుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా జైస్వాల్ నిలిచాడు.
రుతురాజ్, దూబే పోరాడినా..: భారీ ఛేదనలో చెన్నై అసలు ఏ దశలోనూ రేసులో నిలువలేకపోయింది. పేసర్ సందీప్ శర్మ పొదుపైన బౌలింగ్‌కు తోడు స్పిన్నర్లు అశ్విన్, జంపా వికెట్ల వేట సాగించారు. రుతురాజ్‌తో పాటు దూబే, అలీ కాస్త పోరాడినా ఓటమి అంతరం తగ్గించగలిగారు. వరుసగా నాలుగు అర్ధసెంచరీలతో భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కాన్వే (16 బంతుల్లో 8) ఈ మ్యాచ్‌లో పరుగుల కోసం ఇబ్బందిపడ్డాడు. పవర్‌ప్లే ఆఖరి బంతికి అవుటైన తను భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఆరంభ నాలుగో ఓవర్‌లో 4,6 బాదిన మరో ఓపెనర్ రుతురాజ్ అడపాదడపా బౌండరీలతో క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశాడు. కానీ పదో ఓవర్‌లో రుతురాజ్‌ను ఆడమ్ జంపా.. తర్వాతి ఓవర్‌లోనే రహానె (15), రాయుడు (0)లను అశ్విన్ అవుట్ చేయడంతో చెన్నై 73/4 స్కోరుతో ఓటమి దిశగా పయనించింది. ఈ దశలో దూబే, అలీ (23) జోడీ ఎదురుదాడి ఆరంభించి కాస్త ఆశలు రేపింది. 13వ ఓవర్‌లో అలీ 6,4.. 14వ ఓవర్‌లో దూబే 6,6తో వేగంగా పరుగులు వచ్చాయి. కానీ జంపా మరోసారి దెబ్బతీస్తూ అలీ వికెట్ తీయడంతో ఎలాంటి ఆశలు లేకుండా పోయాయి. ఐదో వికెట్‌కు ఈ జోడీ మధ్య 51 పరుగులు సమకూరాయి. అటు 17వ ఓవర్‌లో దూబే 6,4,4.. 18వ ఓవర్‌లో జడేజా (23 నాటౌట్) 4,4 బాదినా ఆఖర్లో సమీకరణం 6 బంతుల్లో 37కు చేరింది. పేసర్ కుల్దీప్ యాదవ్ మాత్రం కేవలం 4 పరుగులే ఇవ్వగా.. 29 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన దూబే చివరి బంతికి అవుటయ్యాడు.
జైస్వాల్ దూకుడు: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జైస్వాల్ అదరగొట్టాడు. అలాగే ఆఖర్లో ద్రువ్ జురెల్, దేవ్‌దత్ హిట్టింగ్ జట్టు భారీ స్కోరుకు కారణమైంది. డాషింగ్ ఓపెనర్ బట్లర్ (27) ధాటిగా ఆడడంలో ఇబ్బందిపడినా జైస్వాల్ మాత్రం పేసర్ ఆకాశ్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి ఆరంభించాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో మూడు ఫోర్లు, మూడో ఓవర్‌లో 4,6,4,4తో చెలరేగడంతో పవర్‌ప్లేలో ఆర్‌ఆర్ 64 పరుగులు సాధించింది. తర్వాతి ఓవర్‌లోనే సిక్సర్‌తో 26 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇక క్రీజులో ఇబ్బందిపడుతున్న బట్లర్‌ను జడేజా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 10 ఓవర్లలో సరిగ్గా 100 పరుగులు సాధించిన ఆర్‌ఆర్ ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. ఇక 14వ ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే డబుల్ ధమాకాతో చెన్నైని మురిపించాడు. కెప్టెన్ శాంసన్ (17)తో పాటు ఊపు మీదున్న జైస్వాల్ వికెట్లను తీశాడు. కాసేపటికే హెట్‌మయెర్ (8) కూడా వెనుదిరగడంతో ఆర్‌ఆర్ 180 స్కోరు కూడా సందేహంగా కనిపించింది. కానీ 18వ ఓవర్‌లో పడిక్కళ్ రెండు ఫోర్లు, 19వ ఓవర్‌లో జురెల్ 4,6తో స్కోరు జోరందుకుంది. ఇక ఆఖరి ఓవర్‌లోనూ జురెల్ 6,4 బాది రనౌట్ కాగా పడిక్కళ్ మరో ఫోర్‌తో స్కోరు 200 దాటింది.
స్కోరుబోర్డు
రాజస్థాన్: యశస్వీ జైస్వాల్ (సి) రహానె (బి) దేశ్‌పాండే 77, బట్లర్ (సి) దూబే (బి) జడేజా 27, శాంసన్ (సి) రుతురాజ్ (బి) దేశ్‌పాండే 17, హెట్‌మయెర్ (బి) తీక్షణ 8, ధ్రువ్ జురెల్ (రనౌట్) 34, పడిక్కళ్ (నాటౌట్) 27, అశ్విన్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 202/5; వికెట్ల పతనం: 1-86, 2-125, 3-132, 4-146, 5-194; బౌలింగ్: ఆకాశ్ 2-0-32-0, తుషార్ దేశ్‌పాండే 4-0-42-2, తీక్షణ 4-0-24-1, జడేజా 4-0-32-1, మొయిన్ అలీ 2-0-17-0, పథిరన 4-0-48-0.
చెన్నై: రుతురాజ్ (సి) పడిక్కళ్ (బి) జంపా 47, కాన్వే (సి) సందీప్ (బి) జంపా 8, రహానె (సి) బట్లర్ (బి) అశ్విన్ 15, దూబే (సి) బట్లర్ (బి) కుల్దీప్ 52, రాయుడు (సి) హోల్డర్ (బి) అశ్విన్ 0, మొయిన్ అలీ (సి) శాంసన్ (బి) జంపా 23, జడేజా (నాటౌట్) 23, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 170/6; వికెట్ల పతనం: 1-42, 2-69, 3-73, 4-73, 5-124, 6-170; బౌలింగ్: సందీప్ 4-0-24-0, కుల్దీప్ 3-0-18-1, హోల్డర్ 4-0-49-0, అశ్విన్ 4-0-35-2, జంపా 3-0-22-3, చాహల్ 2-0-21-0.