HBH: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహ యజమానిగా విజయ్ దేవరకొండ
ABN , First Publish Date - 2023-01-23T22:23:48+05:30 IST
పాన్‌ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రీడా రంగంలో అడుగుపెట్టాడు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (Prime Volleyball League) జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (Hyderabad Black Hawks) సహ- యజమానిగా మారాడు.
హైదరాబాద్, 22 జనవరి 2023 : పాన్‌ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రీడా రంగంలో అడుగుపెట్టాడు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (Prime Volleyball League) జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (Hyderabad Black Hawks) సహ- యజమానిగా మారాడు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్కటీమ్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. లీగ్ మ్యాచ్‌లతోపాటు అంతర్జాతీయ వీక్షకుల ముందుకు టీమ్‌ను విభిన్నంగా తీసుకెళ్లనున్నాడు.
బ్లాక్‌హాక్స్ ప్రధాన యజమాని అభిషేక్ రెడ్డి కనకాల మాట్లాడుతూ ‘‘విజయ్ మాతో చేరడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. విజయ్ బ్రాండ్ అంబాసిడర్, సహ-యజమానిగా వ్యవహరించనున్నారు. ఆయనతోపాటు టీమ్‌కు నూతన విధానం తీసుకురావడంతో మా బ్రాండ్‌ను మరో దశకు తీసుకువెళ్లగలము. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంస్కృతి, స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించాలనే మా లక్ష్య సాధన దిశగా అతి పెద్ద ముందడుగనూ వేశాం. రాబోయే వాటి గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.
ఇక ఈ భాగస్వామ్యంపై దేవరకొండ మాట్లాడుతూ ‘‘ బ్లాక్ హాక్స్ స్పోర్ట్స్ టీమ్‌కు మించినది. తెలుగు వారసత్వం సగర్వంగా ప్రదర్శించాలనుకునే మా అందరికీ ఇది గర్వ కారణం. తెలుగు ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాదు, మన స్ఫూర్తి మరియు శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్ మరియు టీమ్‌ను భారతదేశం మాత్రమే కాదు. ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు చేయాల్సినంతగా నేను చేస్తాను’’ అని అన్నాడు.
బ్లాక్‌హాక్స్ లక్ష్య సాధన గురించి అభిషేక్ రెడ్డి కనకాల, విజయ్ దేవరకొండ ఉమ్మడిగా మాట్లాడుతూ ‘‘మా లక్ష్యం, మా ప్రజలు. ప్రతి దశలోనూ వారి జీవితాలను మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నాము. (ప్రైమ్ వాలీబాల్ లీగ్) మ్యాచ్ కేవలం ఆరంభం మాత్రమే. వాలీబాల్‌ను దేశంలో ప్రతి మూలకూ తీసుకువెళ్లాలన్నది మా లక్ష్యం. అన్ని వయసులు, లింగాలు, బ్యాక్‌గ్రౌండ్స్, అన్ని స్ధాయిల అథ్లెటిజం కలిగిన ప్రజలకు దీనిని చేరువ చేయాలనుకుంటున్నాం. మన నగరాల్లాగానే మన గ్రామీణ ప్రాంతాలలో సైతం కమ్యూనిటీలకు తగిన సాధికారిత అందించాలనుకుంటున్నాము. అలాగే మన చిన్నారులకు సమానమైన అవకాశాలనూ అందించాలనుకుంటున్నాము. మేము వాలీబాల్‌ను కేవలం ఓ క్రీడగా మాత్రమే కాదు, దీనిని ప్రతి ఒక్కరికీ సహాయపడుతూనే , ప్రయోజనం కలిగించే రీతిలో మార్చాలనుకుంటున్నాము’’అని చెప్పారు.
కాగా రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ 23 అనేది ప్రైవేట్ యాజమాన్య నిర్వహణలోని ఇండియన్ ప్రొఫెషనల్ వాలీబాల్ లీగ్. హైదరాబాద్, అహ్మాదాబాద్, కోల్‌కతా, కాలికట్, కొచి, చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి ఎనిమిది టీమ్‌లు దీనిలో పోటీపడుతున్నాయి. ఇది ఒకే సమయంలో ఇంగ్లీష్ , హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషలలో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.