WFI Elections: మరో రెజ్లర్ కీలక ప్రకటన.. నేనూ పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తా..!!
ABN , Publish Date - Dec 23 , 2023 | 09:09 PM
WFI Elections: ప్రముఖ పారా రెజ్లర్ వీరేందర్ సింగ్ తాను కూడా కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వెల్లడించాడు. తన సోదరి, ఈ దేశ పుత్రిక సాక్షి మాలిక్ కోసం తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వివరించాడు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్ సహాయకుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడం పెద్ద దుమారం రేపుతోంది. ఆయన ఎన్నికను నిరసిస్తూ ఇప్పటికే ఇద్దరు రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకోగా ఇప్పుడు వాళ్ల బాటలోనే మరో రెజ్లర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ప్రముఖ పారా రెజ్లర్ వీరేందర్ సింగ్ తాను కూడా కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వెల్లడించాడు. తన సోదరి, ఈ దేశ పుత్రిక సాక్షి మాలిక్ కోసం తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వివరించాడు. సాక్షి మాలిక్‌ను చూసి తాను గర్వపడుతున్నట్లు తెలిపాడు. దేశంలోని ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతున్నట్లు సోషల్ మీడియాలో వీరేందర్ సింగ్ పోస్ట్ చేశాడు.
కాగా పారా రెజ్లర్ వీరేందర్ సింగ్‌కు 2021లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అదే ఏడాది నవంబరులో ఈ అవార్డును అందుకున్న అతడు.. మరుసటి రోజే పారా అథ్లెట్లకు న్యాయం చేయాలంటూ హర్యానా సీఎం ఇంటి ముందు అవార్డులతో నిరసన చేపట్టాడు. ఇప్పుడు మరోసారి తన పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించి నిరసన తెలియజేశాడు. కాగా డబ్ల్యూఎఫ్‌ఐ నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. మరో రెజ్లర్ బజ్‌రంగ్ పునియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.