ChatGPT: యువతి పొట్టకొట్టిన చాట్ జీపీటీ.. ఏకంగా 90% సంపాదనకు ఎసరు.. అసలు ఏం జరిగిందంటే..?
ABN , First Publish Date - 2023-08-05T21:46:31+05:30 IST
ఓపెన్ ఏఐ కంపెనీ అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ(artificial intelligence chatbot ChatGPT) అనేక మంది ఉద్యోగుల పొట్ట కొడుతోంది. చాట్ జీపీటీ కారణంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. 2022 చివరలో వచ్చిన చాట్ జీపీటీ వల్ల ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోగా భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ఓపెన్ ఏఐ కంపెనీ అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ(artificial intelligence chatbot ChatGPT) అనేక మంది ఉద్యోగుల పొట్ట కొడుతోంది. చాట్ జీపీటీ కారణంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. 2022 చివరలో వచ్చిన చాట్ జీపీటీ వల్ల ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోగా భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. చాట్ జీపీటీ కారణంగా ముఖ్యంగా కాపీ రైటర్లు, గోస్ట్ రైటర్లు(copywriters and ghostwriters) తీవ్రంగా నష్టపోతున్నారు. కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల శరణ్య భట్టాచార్య(Sharanya Bhattacharya) కూడా చాట్ జీపీటీ కారణంగా నష్టపోయిన వారిలో ఉన్నారు. చాట్ జీపీటీ కారణంగా శరణ్య నెలవారీ ఆదాయం ఏకంగా 90 శాతం తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. శరణ్య భట్టాచార్య చదువుకుంటూనే ఓ క్రియేటివ్ ఏజెన్సీలో పార్ట్ టైమ్ జాబ్ చేసేది. ఆ ఏజేన్సీలో ఆమె కాపీ రైటర్‌గా, గోస్ట్ రైటర్‌గా విధులు నిర్వర్తించేది. మొబైల్ ఫోన్ ద్వారానే ఎస్‌ఈఓ ఆప్టిమైడ్జ్ ఆర్టికల్స్‌ను(SEO-optimized articles) ప్రతివారం రాసి ఇచ్చేది. ఇందుకుగానూ శరణ్యకు నెలకు రూ.20,000కు పైగా ఆదాయం వచ్చేది. దీంతో ఆమె సంపాదన చీరల వ్యాపారం చేసే తల్లికి సహాయంగా ఉండేది. దీంతో శరణ్య కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కావు. జీవితం హాయిగా గడిచిపోయేది. కాగా శరణ్య ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో బయోలాజికల్ సైన్స్ చదువుతుంది.
కానీ 2022 చివరలో చాట్ జీపీటీ(ChatGPT) రావడంతో శరణ్య జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమెకు ఇచ్చే అసైన్‌మెంట్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఒకప్పుడు వారానికి చాలా ఆర్టికల్స్ ఇచ్చిన కంపెనీ.. ప్రస్తుతం నెలకు ఒకటి నుంచి రెండు ఆర్టికల్స్ మాత్రమే ఇస్తోంది. దీంతో ఆమె నెల సంపాదన ఏకంగా 90 శాతం పడిపోయింది. అంటే ప్రస్తుతం నెలకు రూ.2 వేలకు మించి రావడం లేదు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కంపెనీ అసైన్‌మెంట్లను తగ్గించడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆమె సదరు కంపెనీని ప్రశ్నించినప్పటికీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం ఆమె కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. రోజువారీ ఖర్చులను కూడా చాలా వరకు తగ్గించుకుంది. అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చిన చాట్ జీపీటీని తన కంపెనీ ఉపయోగించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో తన కంపెనీ ఏఐ (AI) టూల్‌ను ఉపయోగించి ఆర్టికల్స్ రాయించుకుంటోందని తెలిపింది. అయితే మనుషులు చేసే పనికి, ఏఐ టూల్స్ చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంటుందని ఆమె చెబుతోంది.. తన లాంటి కాపీ రైటర్ల పనీతీరు చాలా ప్రత్యేకంగా ఉంటుందని శరణ్య చెప్పుకొచ్చింది. కాగా చాట్ జీపీటీ వల్ల భవిష్యత్‌లో ఇంకా ఎంత మంది ఉద్యోగాలు పోతాయో అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.