Preeti Case: కేఎంసీ అనస్తీషియా హెచ్ఓడీ నాగార్జునరెడ్డిపై చర్యలు
ABN , First Publish Date - 2023-03-02T21:48:17+05:30 IST
కాకతీయ వైద్య కళాశాల, ఎంజీఎం ఆస్పత్రి అనస్తిషియా విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జునరెడ్డి (Professor Dr. Nagarjuna Reddy)ని ప్రభుత్వం బదిలీ చేసింది.
వరంగల్: కాకతీయ వైద్య కళాశాల, ఎంజీఎం ఆస్పత్రి అనస్తిషియా విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జునరెడ్డి (Professor Dr. Nagarjuna Reddy)ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ జీవోను గురువారం విడుదల చేశారు. రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల నివేదిక ప్రకారం డాక్టర్ కె.నాగార్జునరెడ్డిని భూపాలపల్లి (Bhupalpalli)లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అస్తవ్యస్త అనస్తిషియా..!
ఈ విభాగంలో ఇద్దరు పీజీ విద్యార్థుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో విభాగం అధిపతి డాక్టర్ కె.నాగార్జునరెడ్డి ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల మధ్య సమన్వయాన్ని చేకూర్చాల్సిన హెచ్‌వోడీ ఆ విషయాలు పట్టించుకోకపోవడం కూడా డాక్టర్ ప్రీతి (Doctor Preeti) ఆత్మహత్యకు ఉసిగొల్పాయి. ఈ విషయంపై పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా బదిలీ ఉత్తర్వులు గురువారం విడుదలైయ్యాయి. ప్రధానంగా డాక్టర్ ప్రీతి ఫిర్యాదుపై సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదనీ ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు సమాచారం.
డాక్టర్ నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేయాల్సిందే..
ప్రీతి మృతికి పరోక్షంగా కారణమైన డాక్టర్ నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డాక్టర్ ప్రీతి న్యాయ పోరాట కమిటీ ప్రతినిధి బానోతు నెహ్రూ నాయక్ డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్య జరిగిన వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని, అంతకంటే ముందు డాక్టర్ నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేయాలని తాము ఆందోళన చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం మాత్రం కంటితుడుపు చర్యగా బదిలీ చేసి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డాక్టర్ కె.నాగార్జునరెడ్డిని సస్పెండ్ చేయకపోతే దశలవారిగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.