Jayasudha: బీజేపీలో చేరిన సినీ నటి జయసుధ
ABN , First Publish Date - 2023-08-02T16:58:14+05:30 IST
తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ (Tarun Chugh) సమక్షంలో సినీ నటి జయసుధ (actress Jayasudha) బీజేపీలో చేశారు.
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ (Tarun Chugh) సమక్షంలో సినీ నటి జయసుధ (actress Jayasudha) బీజేపీలో చేశారు. జయసుధకు పార్టీ కండువ కప్పి సభ్యత్వ రశీదును తరుణ్ చుగ్ అందిచారు. పార్టీ చేరిక కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సినీ నటి జయసుధ సమావేశమయ్యారు. పార్టీలో చేరే అంశంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. అన్ని వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని జయసుధకు అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది.
పార్టీలోకి జయసుధ రావడం సంతోషంగా ఉందని, అమెకు స్వాగతం పలుకుతున్నానని తరుణ్ చుగ్ తెలిపారు. బీజేపీలో చేరినట్లు జయసుధ తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందని, బీజేపీలో చేరాలని ఏడాది కాలం నుంచి అనుకుంటున్నానని ఆమె తెలిపారు. మతం, కులం పరంగా కాకుండా ప్రజలకు సేవ చేయాలని బీజేపీలో చేరానని జయసుధ చెప్పారు. క్రైస్తవుల తరుపున కూడా ప్రాతినిధ్యం వహిస్తానని ఆమె అన్నారు.
"జయసుధకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నా. జయసుధ చేరిక పార్టీకి మరింత ఉత్సాహం. కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలనా రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీఆరెస్ ఓడిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బస్తీలా అభివృద్ధిపై జయసుధకు చిత్తశుద్ధి ఉంది." అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
"ప్రధాని విధానాలు నచ్చి బీజేపీలో చేరుతున్నారు. ప్రధాని నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. సంవత్సరం నుంచి చర్చలు జరుగుతున్నాయి. అమిత్ షాను కలిశా. పని చేయాలనే తపనతోనే బీజేపీలోనే చేరుతున్నా. జయసుధగా, ప్రజలకు మంచి చేయాలనే జాతీయ పార్టీలో చేరాను. క్రైస్తవుల గొంతు వినిపిస్తూనే ఉంటా." అని బీజేపీ నాయకురాలు జయసుధ అన్నారు.