చారిత్రాత్మక ధర్మాసాగర్‌ చెరువుకు గండి

ABN , First Publish Date - 2023-03-17T02:03:01+05:30 IST

పట్టణ నడిబొడ్డున గల ధర్మాసాగర్‌ చెరువు శిఖంలో ‘రియల్‌’ కంత్రీగాళ్లు రెచ్చిపోతున్నారు.

చారిత్రాత్మక ధర్మాసాగర్‌ చెరువుకు గండి
ధర్మాసాగర్‌ చెరువులో ఏర్పాటు చేసిన వెంచర్‌

బఫర్‌ జోన్‌లో దర్జాగా దందా

అగ్రనేత అండతోనే ఇదంతా!?

ఫిర్యాదు చేసినా.. పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ అధికారులు

నిర్మల్‌, మార్చి16 (ఆంధ్రజ్యోతి): పట్టణ నడిబొడ్డున గల ధర్మాసాగర్‌ చెరువు శిఖంలో ‘రియల్‌’ కంత్రీగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా చెరువు స్థలాన్నే కబ్జా చేశారు. పైగా వెంచర్‌ వేసి మరీ నిరుపేదలకు అంటగడు తూ.. రూ.కోట్లు దండుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన జిల్లా ఉన్నతాధికారు లు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు.

జిల్లాకేంద్రం అంటేనే గొలుసు కట్టు చెరువులకు పెట్టింది పేరు. 16వ శతాబ్దంలో నిర్మల్‌ ప్రాంతాన్ని ఏలిన నిమ్మ నాయుడు కాలంలో తాగు, సాగునీటి అవసరాల కోసం నిర్మించిన గొలుసు కట్టు చెరువులు తెలంగాణలోనే అత్యంత చారిత్రత్మాకమైనవి. అదే స్థాయిలో చెరువుల కబ్జాలకు పట్టణం కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే చెరువుల శిఖం భూములు, రైత్వారీ పట్టా భూములు రియల్‌ వ్యాపారుల ధన దాహానికి అన్యాక్రాంతమయ్యాయి. అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్న రియల్‌ మాఫియా కన్ను.. తాజాగా పట్టణంలోని ధర్మాసాగర్‌ చెరువుపై పడింది. చెరువుకు దౌర్జన్యంగా గండి కొట్టి మరీ ప్లాట్లు వేశారు. ఈదందా వెనుక అధికార పార్టీ అగ్రనేత అండ ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పట్టణంలోని నడిబొడ్డున బస్టాండ్‌ పక్కనే ఉంది. గతంలో ఇదో భారీ తటాకంలా ఉండేది. కానీ చెరువు చుట్టూ రియల్‌ వ్యాపారుల అక్రమాల కారణంగా క్రమంగా కుశించుకుంటూ వస్తోంది. మొన్నటిదాక చెరువు బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలో మాత్రమే అక్రమంగా చొరబడిన రియల్‌ వ్యాపారులు.. తాజాగా ధర్మాసాగర్‌ చెరువు భారీ కట్టను కూల్చివేసి ప్లాట్లు వేయ డం అనేక ఆరోపణలకు తావిస్తోంది. ఈ దందాపై ఓ ఇరిగేషన్‌ అధికారి మొండి ధైర్యంతో ఫిర్యాదు చేసినప్పటికీ.. చర్యలు తీసుకునేవారే లేరు.

చెరువు కట్ట ధ్వంసం చేసి.. ఆ పై ప్లాట్లు వేసి..

ధర్మాసాగర్‌ చెరువు పశ్చిమ భాగం వైపు బఫర్‌ జోన్‌లో సుమారు రెండు ఎకరాలకు పైగా రైత్వారీ పట్టా భూమిని ముగ్గురు వ్యక్తుల పేర్ల మార్పిడీ అనంతరం తాజాగా అగ్రనేత సమీప వ్యక్తి పేరిట మారింది. ఆ భూమిలో ప్లాట్లు వేసేందుకు ధర్మాసాగర్‌ చెరువు కట్ట ప్రధాన అడ్డంకిగా మారింది. దానిని తొలగిస్తే ఎలాంటి అనుమానం రాకుండా మైదాన ప్రాం తంగా మార్చేందుకు వీలు పడడంతో సదరు వ్యక్తి చెరువు కట్టపైనే కన్నేశా డు. రాత్రివేళల్లో భారీ యంత్రాలతో చెరువు కట్టను పూర్తిగా ధ్వంసం చేసి ఆ భూమి ప్రాంతాన్ని మైదాన ప్రాంతంగా మార్చేశాడు. వందల కొద్దీ టిప్పర్‌లతో చెరువు బఫర్‌ భూమిని మొరంతో నింపి రియల్‌ వెంచర్‌ వేశారు. ప్రస్తుతం ఆ భూమిని ప్లాట్లుగా మార్చి ఓ రియల్‌ వ్యాపారికి అమ్మినట్లు తెలుస్తోంది. ఇంత వ్యవహారం జరుగుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం కనీస చర్యలు తీసుకోవడం లేదు. చెరువులను పరిరక్షించాల్సిన నీటి పారుదల శాఖ తమ అధికారి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించ డం మినహా ఎలాంటి రక్షణ చర్యలను తీసుకోలేదన్న ఫిర్యాదులున్నాయి. పోలీసు శాఖకు ఫిర్యాదు అందినప్పటికీ.. చెరువు కట్టను ధ్వంసం చేస్తున్న వ్యవహారం కళ్ల ముందే జరిగినప్పటికీ.. సివిల్‌ మ్యాటర్‌ మాదిరిగా పోలీసు లు వదిలేశారు. ఇక ప్రభుత్వ శాఖలకు పెద్దన్నగా వ్యవహరించే రెవెన్యూ శాఖ సైతం గుడ్లౄప్పగించి చూడడం మినహా చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. మూడు ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకోకుండా కళ్ల ముందే ప్రజల ఆస్తి ధ్వంసం అవుతున్నా.. పట్టించుకోకుండా ఉండడం వెనక జిల్లా అధికార పార్టీ అగ్రనేత అండ ఉందన్న విమర్శలున్నాయి.

పలువురి చేతులు మారి..

ధర్మాసాగర్‌ చెరువు బఫర్‌ జోన్‌లో గతంలో రైత్వారీ పట్టాలు ఉండేవి. అలాంటి పట్టాలు ఉన్న భూముల్లో రైతులు చెరువు ఎండినప్పుడు మాత్ర మే అందులో వ్యవసాయం చేసుకునే విధంగా నిబంధనలు ఉన్నాయి. ఈ భూముల్లో సేద్యం చేయడం మినహా ప్లాట్లు వేయడం, నిర్మాణాలు చేపట్టడం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదన్న కఠిన ఆంక్షలు ఉన్నాయి. కానీ అ ఽధికార పార్టీ అండతో అలాంటి భూములు రియల్‌ వ్యాపారుల వశమై చెరు వు శిఖం, బఫర్‌ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు, గృహ నిర్మాణాలు, వా ణిజ్య పరమైన భవంతులు వెలుస్తున్నాయి. తాజాగా ఆక్రమణకు గురైన ధర్మాసాగర్‌ చెరువు భూమి గతంలో రైతుల పేరిట ఉండేది. ఆ తరువాత కొందరు విద్యాసంస్థల నిర్మాణం కోసం సొసైటీ పేరిట కొనుగోలు చేశారు. అప్పట్లోనే అక్కడ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించగా.. మత్య్సకార కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో వెనకడుగు వేసిన వారు ఆ తరువాత ప్రముఖ నేత కొడుకుకు ఆ భూమిని అమ్మినట్లు రికార్డులు త యారయ్యాయి. దానిపై కూడా తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో ఆ అగ్ర నేతకు అత్యంత సన్నిహితంగా ఉండేవారి భాగస్వామికి భూమిని అమ్మిన ట్లు రికార్డులు మారాయి. తాజాగా కొనుగోలు చేసిన వ్యక్తే చెరువు కట్టను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

రూ. 15కోట్లకు పైనే విలువ

ధర్మాసాగర్‌ ప్రాంతంలో ఒక్కో ప్లాటు సైజును బట్టి కనీసం రూ.30 లక్షల నుంచి రూ. 60 లక్షల దాక పలుకుతోంది. సుమారు రెండు ఎకరాల పై చిలుకు భూమిలో చెరువు బఫర్‌ జోన్‌లో వేసిన ప్లాట్లు దాదాపు 30కి పైగా ఉన్నాయి. ఆ లెక్కన చెరువు కట్టను గండికొట్టి బఫర్‌ జోన్‌గా మా ర్చిన భూమి ధర సుమారు రూ. 15 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి చెరువు బఫర్‌ భూములను పరిరక్షించాలని భారీ చెరువు కట్టను తిరిగి పునర్‌ నిర్మించాలని, అక్రమంగా చెరువు కట్టను ధ్వంసం చేసి ప్లాట్లు వేసిన వ్యక్తిపై కేసులు నమోదు చేయాలని పట్టణ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-03-17T02:03:01+05:30 IST