తెరపైకి బీసీ నినాదం..!

ABN , First Publish Date - 2023-01-07T22:19:38+05:30 IST

మంచిర్యాల నియోజకవర్గం బీసీలకు కేటాయించాలనే నినాదం తెరపైకి వస్తోంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు బీసీ నాయకులు రహస్యంగా సమావేశం కావడమే దీనికి బలం చేకూరు స్తోంది

 తెరపైకి బీసీ నినాదం..!

మంచిర్యాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నియోజకవర్గం బీసీలకు కేటాయించాలనే నినాదం తెరపైకి వస్తోంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు బీసీ నాయకులు రహస్యంగా సమావేశం కావడమే దీనికి బలం చేకూరు స్తోంది. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో బెల్లంపల్లి, చెన్నూరు నియోజక వర్గాలు షెడ్యూల్డు కులాలకు రిజర్వు కాగా మంచిర్యాల జనరల్‌ కేటగిరీ కింద ఉంది. పై రెండు నియోజకవర్గాల నుంచి అవకాశాలు లేకపోవడం, బీసీల సంఖ్య అధికంగా ఉండటంతో మంచిర్యాల నుంచి వెనుకబడ్డ కులస్థులు వచ్చే ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించాలనే పట్టుదలతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీసీ నినాదం తెరపైకి రాగా నియోజకవర్గ వ్యాప్తంగా కలిసికట్టుగా పాదయాత్రలు నిర్వహిం చారు. ప్రత్యేక కమిటీలు వేసుకుని బీసీలకే మద్దతు ఇవ్వాలంటూ తీర్మా నాలు చేశారు. తీరా ఎన్నికల సమయం దగ్గరపడ్డ కొద్దీ ఎవరికివారే స్తబ్దంగా ఉండటంతో అప్పుడు బీసీ నినాదం మరుగున పడింది. సంవత్సరం లోపు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో మరోసారి బీసీ నినాదం తెరపైకి వచ్చింది. అయితే గతంలో మాదిరిగా కాకుండా కలిసికట్టుగా ఉండి టికెట్‌ సాధించుకోవాలనే పట్టుదలతో నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.

డెబ్బై ఏళ్లలో ఒకే ఒకరు..

మంచిర్యాల నియోజకవర్గం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలో లక్షెట్టిపేట పేరుతో ఉండేది. లక్షెట్టిపేట నియోజకవర్గం మొదటిసారిగా 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి మొన్నటి 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు సుమారు 70 సంవత్సరాల్లో ఒకే ఒకసారి బీసీ అభ్యర్థి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1952లో సోషలిస్టు పార్టీ తరుపున లక్షెట్టిపేట నియోజక వర్గానికి కోదాటి రాయమల్లు, విశ్వనాథరావు ఎమ్మెల్యేలుగా ప్రాతినిఽథ్యం వహించారు. అనంతరం 1957, 1962లో జీవీ పితాంబర్‌రావు, 1967లో జేవీ నర్సింగరావు (ఉప ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు) ఎమ్మెల్యేగా ఎన్నికకాగా 1972లోనూ ఆయనే ప్రాతినిధ్యం వహించారు. 1978లో తొలిసారిగా జనతా పార్టీ నుంచి చుంచు లక్ష్మయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన వెనుకబడ్డ కులానికి చెందిన వాడు కాగా నియోజకవర్గంలోనే బీసీ సామాజిక వర్గం నుంచి ఎన్నికైక ఏకైక వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచారు. అనంతరం 1983లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీమనోహర్‌రావు, 1985 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున జీవీ సుధాకర్‌రావు గెలుపొందగా, 1989లోనూ ఆయనే ఎన్నికయ్యారు. 1994లో టీడీపీ ఊపుమీద ఉన్న సమయంలో గోనె హన్మంతరావు ఎన్నికకాగా, 1999లో కాంగ్రెస్‌ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు గెలుపొందారు. 2004లోనూ దివాకర్‌రావే ఎన్నిక కాగా 2009 లక్షెట్టిపేటకు బదులు మంచిర్యాల నియోజకవర్గంగా ఆవిర్భవించిది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గడ్డం అరవిందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొం దారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా అరవిందరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఆయనే గెలుపొందారు. అనంతరం 2014లో నడిపెల్లి దివాకర్‌రావు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 2018లోనూ దివాకర్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పార్టీ అధిష్టానాన్ని ఒప్పించేలా...

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు చెందిన బీసీ నాయకులు సమావేశం కాగా, రాబోయే ఎన్నికల్లో వెనుకబడ్డ కులాలకు చెందిన వారికే టిక్కెట్టు దక్కేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన బీసీ నాయకులు త్వరలో బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలిసి తమ సామాజిక వర్గానికే టికెట్‌ ఇచ్చేలా ఒప్పించేందుకు తీర్మానం చేసినట్లు సమాచారం. ఈలోగా బీఆర్‌ఎస్‌కు చెందిన మఖ్య నేతలందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చేందుకు నిర్ణయించారు. మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీ తరుపున బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరికి టికెట్‌ ఇచ్చినా నాయకులందరూ కలిసికట్టుగా మద్దతు పలకాలని నిర్ణయించారు. అలాగే కేవలం బీఆర్‌ఎస్‌ నుంచేగాక ఇతర ప్రముఖ రాజకీయ పార్టీల నుంచి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్‌ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టనున్నట్లు సమాచారం. మంచిర్యాల నియోజకవర్గం జనాభా మొత్తంలో 60 శాతం బీసీ సామాజిక వర్గం ఉంది. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 40వేల ఓటర్లు ఉండగా అందులో దాదాపు లక్షా 60వేల వెనుకబడిన కులాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన చూసినా బీసీ ఓటర్లే అధికంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులకే టికెట్‌ ఇచ్చేలా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులుపై ఒత్తిడి తెచ్చేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి.

Updated Date - 2023-01-07T22:19:42+05:30 IST